నెరవేరని అమరుల ఆకాంక్షలు: కోదండరామ్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడి మూడేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ప్రజలు ఏ లక్ష్యం కోసమైతే పోరాడారో అది సాకారం కావాల్సి ఉందన్నారు. 5వ విడత తెలంగాణ అమరవీరుల స్ఫూర్తియాత్ర బాసర చేరుకుంది. ఆయనకు జిల్లా ఐకాస నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అమరుల ఆకాంక్షలు నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని అన్నారు. ఈ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగుతుంది. ఇందుకోసం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి నేరుగా ఆయన బాసర చేరుకున్నారు. అక్కడ నుంచి స్ఫూర్తి యాత్రను ప్రారంభించనున్నారు. మంచిర్యాలలో ఈ యాత్ర ముగియనుంది. బోథ్‌లోని ఫ్రెండ్స్‌క్లబ్‌ మైదానంలో ఈ నెల 10న ఐకాస ఆధ్వర్యంలో కోదండరాం నాయకత్వంలో అమరుల స్ఫూర్తియాత్రలో భాగంగా నిర్వహించబోయే ధూంధాం బహిరంగ సభను రైతులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు విజయవంతం చేయాలని ఐకాస జిల్లా సమన్వయకర్త, తెవివే జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల శంకర్‌ పిలుపునిచ్చారు. అమరుల స్ఫూర్తియాత్ర బహిరంగ సభకు సంబంధించిన గోడ ప్రతులను స్థానిక ప్రయాణ ప్రాంగణం ముందు నాయకులు విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు స్పూర్తియాత్ర కుంటాల జలపాతం నుంచి ప్రారంభమై నేరడిగొండ విూదుగా బోథ్‌కు చేరుకుంటుందన్నారు. రాష్ట్ర ఐకాస నాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు.

తాజావార్తలు