నెలాఖరుకు పోల్ చీటీల పంపిణీ
బిఎల్‌వోలకు బాధ్యతలు అప్పగింత
అందుల ఓటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు
ఆదిలాబాద్,నవంబర్27(జనంసాక్షి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా జిల్లాల వారీగా సరఫరా చేసిన ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయనున్నారు. ఈ నెలాఖరులోగా పంపిణీ చేయాలని అదేశించింది. బీఎల్‌వోలు స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ స్లిప్పులను అందజేస్తారు. ఆ ఓటర్ స్లిప్పులను కుటుంబ సభ్యులకు మాత్రమే అం దజేయాలని అదేశాలున్నాయి.పోల్ చిటీల బాధ్యతను ఎన్నిల సంఘం ఆయా పో
లింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న బూత్ స్థాయి అధికారులకు అప్పగించింది. దీంతో బీఎల్‌వోలు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో గమనించి వాటిని ఈ నెలాఖరులోగా ఓటర్లకు ఎలా పంపిణీ చేయాలనే దానిపై ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఓటర్లకు సకాలంలో పోల్‌చిటీలను సరఫరా చేసేలా బీఎల్‌వోలు సిద్ధమవుతున్నారు. ఓటర్ స్లిప్పులు సకాలంలో పంపిణీ కాకపోతే అంగన్‌వాడీ, ఆయాల సహకారం తీసుకోనున్నారు. ఎన్నికల సంఘం అందజేసే స్లిప్పులపై ఓటరు ఫొటో, పేరు, చిరునామా, వయస్సు, గ్రామం, నియోజకవర్గం, జిల్లా తదితర వివరాలు ఉంటాయి. ఈ నెల 19న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాకు 21.75 లక్షల స్లిప్పులు వచ్చాయి. వీటిని ఇదివరకే పది నియోజక వర్గాలకు పంపిణీ చేశారు. అధికారులు ప్రతిపాదించిన వాటికంటే ఎన్నికల సంఘం ఎక్కువ ఓటర్ స్లిప్పులను పంపించింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఓటర్ స్లిప్పులు చేరుకోగా.. పంపిణీకి ఆయా జిల్లాల అధికారులు రంగం సిద్ధం చేసుకొన్నారు.వీటిని సాధ్యమైనంత త్వరగా ఓటర్లకు అందజేయాలని యోచిస్తున్నారు. ఇకపోతే అంధులు ఓటు హక్కు వినియోగించు కొనేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అంధులతో పాటు సహాయకునిగా ఒకరికి ఎన్నికల అధికారి వెంట అనుమతి ఇస్తారు. ఓటు హక్కు ఉన్న అంధుల వెంట వెళ్లిన సహాయకులు అభ్యర్థి పేరు, గుర్తును అడిగి తెలుసుకుంటారు. చెప్పిన అభ్యర్థికి అంధుని వేలును ఆ గుర్తు బటన్‌కు వేలితో వేయిస్తారు. సహాయకుడు అంధుడు చెప్పిన గుర్తుకే ఓటు వేయించారా..? లేదా ఇతర గుర్తుకు వేశారా అన్నది అటు అధికారులకు, ఇటు అంధులకు తెలియక సందిగ్ధంలోనే ఉండేది. ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఎన్నికల సంఘం రాష్ట్రంలో జరగబోయే సాధారణ ఎన్నికలకు బ్రెయిలీ లిపి ద్వారా అంధులకు ఓటు హక్కు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో ఎంత మంది అంధులు ఓటు హక్కు కలిగి ఉన్నారో సర్వే చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో సర్వే చేశారు. రెండు నియోజకవర్గాల్లో మొత్తం 77 మంది అంధులు ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఏఏ పోలింగ్ బూత్ పరిధిలో ఓటు హక్కు కలిగి ఉన్నారో ఆ పోలింగ్ కేంద్రాల్లో ఈ బ్రెయిలీ లిపిని ఈవీఎంలకు ఏర్పాటు చేయనున్నారు. అంధులు తమ ఈ బ్రెయిలీ లిపి ద్వారా గుర్తును తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.