నెలాఖర్లో వరంగల్ ఉపఎన్నికల నోటిఫికేషన్
– అధికారులు సిద్దంగా ఉండండి
– భన్వర్‌లాల్
వరంగల్ అక్టోబర్17(జనంసాక్షి):
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉందని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఈ మేరకు అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ఇవాళ ఆయన సమావేశమయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భన్వర్ లాల్ చెప్పారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జిల్లాలో 63 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారానికి బయటి నుంచి వరంగల్ వచ్చే నేతలపై నిఘా పెడుతామని తెలిపారు.
హైదరాబాద్ లో ఓట్ల తొలగింపు ప్రక్రియ సక్రమంగానే జరిగిందని భన్వర్ లాల్ స్పష్టం చేశారు. రాజకీయ నేతలు స్వప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓటు లేనివాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని భన్వర్ లాల్ సూచించారు. 8790499899 నంబరుకు ఎస్సెమ్మెస్ చేస్తే ఓటు ఉందో లేదో తెలుస్తుందన్నారు.ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కరుణ, జిల్లా ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.