నెల్లూరు జిల్లాలో నగర వ్యాపారి దారుణ హత్య
నెల్లూరు, జూలై 8 : నెల్లూరు జిల్లా అల్లూరు ప్రాంతానికి చెందిన తిరువీధి లక్ష్మీనారాయణ(45) అనే నగల వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి నెల్లూరు రూరల్ మండలంలోని చింతారెడ్డి పాలెం గ్రామంలో హత్య చేసి, తగలబెట్టారు. ఈ సంఘటనపై పోలీసులకు శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సమాచారం అందింది. చింతారెడ్డి పాలెం గ్రామ శివారులో విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో కొవ్వొత్తులతో ఆ ప్రాంతాన్ని గాలించి పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. లక్ష్మీనారాయణ అల్లూరులో చిల్లర దుకాణం నడుపుతూ, నగల వ్యాపారం కూడా చేసేవాడు. ఈ నేపథ్యంలో రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చి తమతో రావాల్సింగా కోరారు. ఆయన అల్లూరు నుంచి నెల్లూరుకు బయలుదేరారని బంధువులు తెలిపారు. పది గంటల ప్రాంతంలో కూడా తమకు ఫోన్ చేసినట్టు లక్ష్మీనారాయణ సోదరుడు ప్రకాశ్‌రావు తెలిపారు. రాత్రి 11 గంటల వరకు కూడా అతను ఇంటికి రాకపోవడం, సెల్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీనారాయణను కారులో ఎక్కించుకుని వెళ్లిన వారు చింతారెడ్డి పాలంకు చెందిన వారుగా భావిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.