నెల రోజుల్లో.. విజయవాడ సింగపూర్ విమాన సేవలు
చంద్రబాబు విజ్ఞప్తికి అంగీకరించిన సింగపూర్ ప్రధాని
నదీతీరాన అద్భుతమైన నగరం అమరావతి
సింగపూర్‌లాంటి నగరంగా ఏపీ రాజధానిని తీర్చిదిద్దుతాం
ఏపీ సీఎం చంద్రబాబు
విజయవాడ, జూన్7(జనం సాక్షి) : నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త. జులైలో విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే నెలలో విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సేవలు ప్రారంభించనున్నట్లు సింగపూర్ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా సింగపూర్-ఆంధప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న మూడో అత్యున్నత సమావేశాల్లో పాల్గొనేందుకు సింగపూర్ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్ గురువారం ఉదయం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతం ‘ ఫేజ్ జీరో’ అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. ఏడీపీ, సింగపూర్ కన్సార్షియం మధ్య అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.
సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో కన్‌స్టక్షన్ర్ మెటీరియల్ సిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. సింగపూర్ సంస్థలు ముందుకొస్తే ఈ ప్రాజెక్టు మరింత వేగవంతమవుతుందన్నారు. అమరావతికి బృహత్ ప్రణాళిక ఇచ్చిన సింగపూర్… నిర్మాణంలోనూ భాగస్వామ్యం వహిస్తోందన్నారు. నదీ తీరాన నిర్మించే అద్భుత నగరం అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సింగపూర్ లాంటి సిటీ కడతామని ఎన్నికల్లో హావిూ ఇచ్చామని, అది నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. సింగపూర్ ప్రభుత్వం రాజధానికి మాస్టర్ ప్లాన్ అందజేసిందని, పరస్పర సంప్రదింపులతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. మూడు విడతలుగా ఈ ప్రాజెక్టును చేపడతామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధిపై ఎంవోయూలు చేసుకున్నామన్నారు. నెల రోజుల్లో సింగపూర్- విజయవాడ మధ్య నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రాజెక్టుపై ఎంతో శ్రద్ధ చూపుతున్నారంటూ ఈశ్వరన్‌కు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.