నేటినుంచి అమరవీరుల వారోత్సవాలు
అడవుల్లో మళ్లీ పోలీసుల అలజడి
జల్లెడపడుతున్న భద్రతా బలగాలి
అప్రమత్తం చేస్తూ రాజకీయ నేతలకు హెచ్చరికలు
హైదరాబాబాద్,జూలై27(జనంసాక్షి ): అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు మళ్లీ హై అలర్ట్‌ను ప్రకటించారు. ప్రతియేటా మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలు జూలై 28నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్నాయి. నగ్జల్‌బరి ఉద్యమానికి ఊపిరిలూదిన చారుమజూందర్ 1972 జూలై 28న అమరులు కాగా, అప్పటి నుంచి వివిధ సంఘటనలో మృతి చెందిన ఉద్యమ నేతలను స్మరించుకుంటూ ప్రతియేటా అమరవీరుల వారోత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో గిరిజన ప్రాంతాలతో పాటు, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఒకవైపు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరిగే నేపథ్యంలో మావోల కదలికలను అణిచి వేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు. సరిహద్దులో మహారాష్ట్ర,ఛత్తీస్‌ఘడ్, పోలీసుల సహాయ,సహకారాలతో ప్రత్యే క బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే జిల్లాలో ఉన్న దట్టమైన అడవులను జ్లలెడ పడుతూ అనుమా నిత వ్యక్తులపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఏదైనా అను మానం వస్తే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వదిలేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బలగాల కదలికలు కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్నిరోజుల పాటు నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తునట్లు తెలిసింది. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల పర్యటనలను రద్దు చేసుకోవాలని పోలీసులు కోరినట్లు సమాచారం. అత్యవసరమైతే తప్ప
సాధారణంగా ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు సైతం సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. వారంరోజుల పాటు మావోయిస్టులు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించడంతో పాటు కొత్త క్యాడర్‌ను రిక్రూట్‌మెంట్ చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు గ్రేహౌండ్స్ బలగాలతో పాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు బలగాలు అడవులను ల్లెడ పడుతున్నాయి. అంతే కాకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాలపై డేగ కన్ను వేసి ఉంచడంతో మావోయిస్టు వారోత్సవాల అలజడి మొదలైనట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టుల పిలుపుతో రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలో గుబులు కనిపిస్తోంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని భయం భయంగా పర్యటనలు చేస్తున్నారు. అసలే జిల్లాలో పోడు భూముల లొల్లి ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు గిరిజన గ్రామాల్లోకి వెళ్లక పోవడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీపై నిషేధం విధించి పోలీసులు అడవులను సైతం జల్లెడపడుతున్న నేపథ్యంలో అమరవీరుల సభల నిర్వహణ మావోయిస్టు పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. గతంలో అటవీ ప్రాంతాల్లో అమరవీరుల దినోత్సవాలను ఘనంగా నిర్వహించే వారు. కాని ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో దండకారణ్యానికి పరిమితమైన మావోయిస్టులు.. ఆ ప్రాంతంలోనే సభలు నిర్వహించుకొని తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు సైతం మావోయిస్టు పార్టీ నిర్వహించే అమరవీరుల దినోత్సవంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్టాల్ర నుంచి మావోయిస్టు నేతలు జిల్లాల్లోకి ప్రవేశించకుండా పకడ్బందీ చర్యలు చేపడు తున్నారు. కరోనా సమయంలో జిల్లాల్లో రిక్రూట్‌మెంట్ జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వారోత్సవాల నేపథ్యంలోనే తాజాగా మావోల లేఖ విడుదల కావడం లకలం రేపుతోంది. దీంతో పోలీసులు ఏజెన్సీ మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ మండలాల పోలీసు స్టేషన్లలో అదనపు సిబ్బందిని పెంచి అప్రమత్తం చేశారు. మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కొందరు సానుభూతిపరులైన మాజీ దళ సభ్యులతో మంతనాలు జరుపుతూ రహస్యంగా మావోల కదలికలను పసిగడుతున్నారు. మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు పోలీసులు కూడా తెలిపారు. గతంతో పోలిస్తే పెద్దా మావోల ప్రభావం లేకున్నా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.