నేటినుంచి చెంగాళమ్మ తిరునాళ్లు

ఘనంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
భారీగా తరలిరానున్న భక్తులు
నెల్లూరు,మే30(జ‌నం సాక్షి):  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చెంగాళమ్మ తిరునాళ్లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఇప్పటికే సూళ్లూరుపేట తిరునాళ్ల శోభ సంతరించుకుంది. ఎంతో పూరాధాన్యం సంతరించుకున్న చెంగాళమ్మ అమ్మవారిక మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంతో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తిరునాళ్లకు తమిళనాడుతోపాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి రానుండటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈదఫా భక్తులను ఆకట్టుకునే విధంగా హెలిటూర్‌, బోటు షికారు, తదితర వాటిని ఆలయ ఛైర్మన్‌ ముప్పాళ్ల వెంకటేశ్వరరెడ్డి ఏర్పాటు చేశారు. తిరునాళ్లు గురువారం నుంచి ఏడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనుంది. ముఖ్యంగా మహిషాసుర మర్దిని, తెప్పోత్సవం రోజుల్లో వీక్షణకు లక్షలాది మంది తరలిరానున్నారు. 31వ తేదీన గురువారం బలిహరణ, జూన్‌ 1న ఆడపడుచు వడిబాల సాంగ్యం, సాయంత్రం ఆలయ ఆవరణలో సుళ్లు ఉత్సవం, రాత్రి ఆశ్వవాహనం, గ్రామోత్సవం జరగనుంది. 2న సాయంత్రం సుళ్లు ఉత్సవం, రాత్రి 9 గంటలకు మహిషాసుర మర్దిని జరగనుంది. అనంతరం రాత్రి అమ్మవారు సింహ వాహనంపై కొలువుదీరి పుర వీధుల్లో ఊరేగనున్నారు. 3న సాయంత్రం సుళ్లు ఉత్సవం, రాత్రి నంది వాహనంపై అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతారు. 4న తేదీ రాత్రి ఏడు గంటలకు కాళంగి నదిలో తెప్పోత్సవం, అనంతరం పుర ఉత్సవం. 5న రాత్రి శయనసేవ, పుర ఉత్సవం, 6న రాత్రి పుష్పపల్లకి సేవతో తిరునాళ్లు ముగుస్తాయి… తిరునాళ్ల సందర్భంగా ప్రతి రోజు రాత్రి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.