నేటినుంచి ‘టెట్‌’ పరీక్షలు

జిల్లాలో ఆరు కేంద్రాల ఏర్పాటు

అభ్యర్థులు నిబంధనలు పాటించాలి: డిఇవో రేణుక

ఏలూరు,జూన్‌9(జనం సాక్షి ): ఉపాధ్యాయ అర్హత (టెట్‌) పరీక్షలను సమర్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక చెప్పారు. ఈనెల 10 నుంచి ‘టెట్‌’ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈనెల 10 నుంచి 19 వరకు జిల్లాలోఎంపికచేసిన ఆరు కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో టెట్‌ పరీక్షలకు 13,190 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. టెట్‌ పరీక్షకు హాజరయే అంధ అభ్యర్థులకు అదనంగా 50 నిమిషాల సమయాన్ని కేటాయించనున్నట్లు చెప్పారు. జిల్లాలో టెట్‌ పరీక్షలకు హాజరుకానున్న 40 మంది దివ్యాంగ అభ్యర్థులకు సహాయకులుగా నియమించే నిమిత్తం వారి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం 1.30 గంటలకు హాజరు కావాలి. పరీక్ష ప్రారంభ సమయానికంటే ముందుగా హాజరు కాలేకపోతే సాంకేతిక కారణాలవల్ల అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌పైవున్న పరీక్ష తేదీ, సమయం, రిజిష్టర్‌ సంఖ్య, పరీక్ష కేంద్రాన్ని సరిచూసు కోవాలన్నారు. ప్రతి ప్రశ్నకు ఇచ్చిన నాలుగు జవాబుల నుంచి సరైన ఒకదాన్ని ఎంచుకుని మౌస్‌ ద్వారా క్లిక్‌ చేయాలి. జవాబు రాయని ప్రశ్నలు ఎరుపు రంగులోను, ప్రయత్నించని ప్రశ్నలు తెలుపు రంగులోను, ప్రయత్నించిన ప్రశ్నలు ఆకుపచ్చని రంగులోను, పున్ణపరిశీలనకు గుర్తించిన ప్రశ్నలు ఊదా రంగులోను కనిపిస్తాయి. ప్రశ్నకు సరైన సమాధానం ఇస్తే ఒక మార్కు ఇస్తారు. సమాధానం ఇవ్వని ప్రశ్నకు సున్నాను కేటాయిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఎవరినీ కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే ఆ విషయాన్ని ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. సెల్‌ఫోన్‌లు , టాబ్లెట్లు, ఐప్యాడ్‌లు, కాలిక్యులేటర్లు, పెన్‌ఫోన్లు, వాచీలు, స్మార్ట్‌ వాచీలను, ఎలక్టాన్రిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు.