నేటి నుంచి పెద్దగట్టు జాతర.. విజయవాడ, ఖమ్మం వెళ్లే వారికి అలర్ట్!
సూర్యాపేట : రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరొందింది. రెండేండ్లకోసారి జరిగే ఈ జాతర ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణలతో ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలకు సుమారు 20నుంచి 25లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులు బందోబస్తుతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి 65పై కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సూర్యాపేట ఎస్‌పీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. వాహనాలను దారి మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి వస్తాయన్నారు.
నార్కట్‌పల్లి వద్ద
హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలను నార్కట్ పల్లి వద్ద మళ్లించి నల్గొండ వైపుగా మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా విజయవాడకు మళ్లించనున్నారు.
కోదాడ వద్ద
విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్ నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్ మళ్ళించనున్నారు.