నేటి పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు
ఉదయం మాక్ పోలింగ్‌తో ప్రారంభం
5గంటల్లోపు క్యూలో ఉన్నవారికి ఓటుహక్కు
మహబూబ్‌నగర్,డిసెంబర్6(జనంసాక్షి): జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ తో శాసనసభ ఎన్నికల పక్రియ ప్రారంభం అవుతుంది. పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటలలోపు కేంద్రం ఆవరణలోకి వచ్చి వరస క్రమంలో ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులను వారి ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి
తరలించడానికి రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. పోలింగ్ కేంద్రంలో ఒక వీల్‌ఛైర్, సహాయకుడు అందుబాటులో ఉంటారన్నారు. గత ఎన్నికలలో పోలింగ్ శాతం 69.5 శాతం నమోదైందని, ఈ సారి 90 శాతం జరిగేలా ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించి ప్రశాంత పోలింగ్ జరిగేవిధంగా చూడాలన్నారు. మొదటిసారి 200 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 1,112 కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ చేపడుతున్నామని తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా 58 ప్రత్యేక బృందాలను జిల్లాలో ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ విధించడంతో పాటు రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఒక ఎస్పీ, అదనపు ఎస్పీలు ఇద్దరు, ఏడుగురు డీఎస్పీలు, సీఐలు 20 మంది, ఎస్సైలు 40 మందితో కలిపి మొత్తం 2,196 మంది సిబ్బంది పాల్గొననున్నారని తెలిపారు. వీరితోపాటు అదనపు బలగాలుగా ప్రత్యేక బలగాలు వస్తున్నాయన్నారు.