నేడు ఉప ఎన్నిక ఫలితం
వరంగల్, నవంబర్ 23 (జనంసాక్షి):
వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కౌంటింగ్ కొనసాగుతుందని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. ఈ నెల 21 న జరిగిన వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నిక కౌంటింగ్ 24 వతేదిన అధికారులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈవీఎం లను నగరంలోని ఏనుమామూల మార్కెట్ కు తరలించారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి మాక్ కౌంటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 14 టెబుల్స్ ను ఏర్పాటు చేశారు. పోలైన ఓట్లను బట్టి అత్యధికంగా భూపాలపల్లి నియోజకవర్గంలో 22 రౌండ్లు, అత్యల్పంగా వరంగల్ తూర్పు 16 రౌండ్ల వారిగా లెక్కింపు జరగనుంది. ఇక పాలకుర్తి 19, స్టేషన్ ఘన్ పూర్ 20, పరకాల 17, వరంగల్ పశ్చిమ 17, వర్థన్నపేట 19 రౌండ్ల వారిగా లెక్కిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ లెక్కింపుకు 6 నిమిషాల సమయంలో పట్టనుంది. తొలి రౌండ్ ఫలితం 11 గంటలకు వస్తుంది. తుది ఫలితం మద్యహ్నం 3 గంటల వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరుణ తెలిపారు. కౌంటింగ్ కేంద్రం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠగా సాగిన వరంగల్ ఉప ఎన్నిక ఫలితంపై గంటలు మాత్రమే మిగిలిఉండడంతో అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల నేతలకు కంటి విూద కునుకులేకుండా చేస్తోంది. పోలింగ్ శాతం తక్కువగా రికార్డు కావడంతో అభ్యర్థులతోపాటు పార్టీల నాయకులు తమకు ఇది లాభం చేకూరుస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు పార్టీలకు చెందిన బడా నాయకులంతా ఇప్పటికే వరంగల్ నగరానికి చేరుకుని ప్రత్యేకంగా బేఠీలు నిర్వహిస్తున్నారు. పోటీ ఏయేపార్టీల మద్య జరిగి ఉంటుంది..ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే అంశాలపై సుదీర్ఘంగా మంతనాలు చేస్తున్నారు. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ ఘట్టం ముగియడంతో ఇప్పుడు అభ్యర్థులంతా ఓట్ల లెక్కింపు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా రు. ఉపఎన్నిక బరిలో నిలిచిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజే పీ, వామపక్షాలతో పాటు పాటు మొత్తం 23మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఉత్కంఠ పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ¬రా¬రీగా సాగింది. గెలుపోటములు ఈ నలుగురి మధ్యే దోబూచులాడుతోంది. ఎవరు గెలుపు గుర్రాన్ని అధిరోహిస్తారోనన్న ఉత్కంఠ అటు అభ్యర్థుల్లో ఇటు ప్రజల్లో అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యనేతలు పోలింగ్ సరళిపై దృష్టి సారించారు. తమకు అనుకూలంగా ఎక్కడ ఎన్ని ఓట్లు పడి ఉండొచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి నాయకులతో మాట్లాడి పోలింగ్ సరళిపై వాకబు చేస్తున్నారు. ఎవరికి అనుకూలంగా ఓట్లు పడ్డాయోనని అడిగి తెలుసుకుంటున్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్లలో తమకు అనుకూలంగా పడిన ఓట్లశాతం ఏ మేరకు ఉంటుందనేదానిపై గ్రామస్థాయి నాయకులతో స్వయంగా మాట్లాడి మరీ తెలుసుకుంటున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు ముఖ్య నాయకులతో సమావేశమై గెలుపోటములపై బేరీజు వేసుకున్నారు. తమ ఆంతరంగికుల ద్వారా క్షేత్రస్థాయిలోని తాజా పరిస్థితిపై సమాచారం తెప్పించుకుంటున్నారు. పోలింగ్ 7.92 శాతం తగ్గడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయంపై కూడా విశ్లేషించుకుంటున్నారు. పోలింగ్ శాతం తగ్గడంపై టీఆర్‌ఎ?సలో కొంత కలవరం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ ఎంత ఎక్కువైతే తమకు అంతలాభం అని భావిస్తున్న ఆ పార్టీ నేతలకు ఇది మింగుడు పడడం లేదు. ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం సహజమేనని పైకిఅంటున్న అంతరంగిక చర్చల్లో దీపిపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. అర్బనలో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, భూపాపల్లిలో 9 నుంచి 10 శాతం మేరకు. పరకాల, పాలకుర్తిలలో 8 శాతం మేరకు, స్టేషన ఘనపూర్‌లో అతి తక్కువగా 5శాతం మేరకు పోలింగ్ తగ్గింది. ఈ పరిణామం గెలుపోటములను ఏమేరకు ప్రభావితం చేస్తుందని చర్చించుకుంటున్నారు. వరంగల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన వద్దనే లెక్కింపు జరుగనుంది. బహుశా మధ్యాహ్నానికి ట్రెండ్ తెలుస్తుందని, సాయంత్రం కల్లా ఫలితం వెలువడుతుందని అన్నారు. ఎనుమాముల వద్ద ఇవిఎంలు భద్రపరచిని చోట పటిష్ఠమైన భద్రత కల్పించారు. పోలీసులు అక్కడ గట్టిగా కాపలా ఉన్నారు. లెక్కింపురోజుమరిన్ని బలగాలురానున్నాయి. లెక్కింపును పురస్కరించుకుని ర్యాలీలు నిషేధించారు. మందు దుకాణాలను బంద్చేయిస్తున్నారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ వాకాటి కరుణ పరిశీలించారు. 24న ఓట్ల లెక్కింపు జరుగుతున్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయని అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భద్రత సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఇదిలావుంటే 21నజరిగిన ఎన్నికలో ఎలాంటి పొరపాట్లు లేకపోవడంతో రీపోలింగ్ అవకాశాలు తగ్గాయి. అయితే పోలింగ్ శాతం మాత్రం తగ్గింది. అయినా ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా అఖండమైన మెజార్టీతో తానే గెల్తున్నానని కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినా తక్కువ సమయంలో తనను వరంగల్ జిల్లా ప్రజలు ఆదరించారన్నారు. తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా కాంగ్రెస్‌ను ఆదరించబోతున్నారని అన్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు బాగా సహకరించారని, అందువల్ల భారీ మెజార్టీలో గెలుపొందుతున్నానని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఇచ్చిన హావిూలను అమలు చేసే విధంగా ప్రజల పక్షాన పోరాడుతానని అన్నారు. ఎంపీ సీటు దక్కించుకునేందుకు తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ఉప ఎన్నిక కోసం మంత్రులందరూ ఇక్కడే మకాం వేయగా,వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలికారని తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారుల తీరు దారుణంగా ఉందన్నారు. ఇన్ని ప్రతికూలతలుఉన్నా గెలుపు తనదేనన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి దయాకర్‌కు ఓట్లేసి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పిచ్చారని టిఆర్‌ఎస్ అభ్యర్థి మసునూరి దయాకర్ అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం తనదేనని, ఇందుకు సిఎం కెసిఆర్ తెలంగాణ పోరాటమే స్ఫూర్తి అన్నారు. తెరాస ప్రభుత్వ పనితీరుకు ఉప ఎన్నిక ఫలితం రెఫరెండమేనన్నారు. రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తారని ప్రజలు నమ్మి ఈ ఎన్నికల్లో తెరాసకు ఓటేశారని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారని వివరించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, భాజపాలు విఫలమయ్యాయన్నారు. కేసీఆర్ పాలనకు మద్దతుగా తెరాస కార్యకర్తలు, కుల సంఘాలు పనిచేయడంతో ఓట్లు ఎక్కువగా పోలయ్యాయన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. నిరుపేదనైన తనకు వరంగల్ ఎంపీ సీటిచ్చిన సీఎం కేసీఆర్ తనకు దైవంతో సమానమన్నారు. తాను ఎన్నికైన తరువాత వరంగల్ అభివృద్ధికి పాటుపడతానన్నారు.