నేడు గద్వాల్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన

– గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్న సీఎం
– గద్వాల్‌లో భారీ బహిరంగ సభ
– సీఎం పర్యటన ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు
– బహిరంగ సభకు లక్షన్నర మందిని తరలించేలా ప్రయత్నాలు
జోగులాంబగద్వాల,జూన్‌27(జ‌నం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలో జోగులాంబకు చేరుకోనున్న సీఎం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. అనంతరం పెంచికలపాడు వద్ద గట్టు ఎత్తిపోతల పథకం పైలాన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం పెంచికల్‌ పాడు నుంచి బయలుదేరి గద్వాల్‌ లో జరిగే బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకొని అక్కడ ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే సీఎం పర్యటన సదర్భంగా అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి..
సీఎం కేసీఆర్‌ జోగులాంబగద్వాల పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనలో భాగంగా పరిశీలించనున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నుంచి గట్టులో పైలాన్‌ ను ఆవిష్కరణ, అక్కడి నుండి గద్వాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడి సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బుధ, గురువారాల్లో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌, ఎస్పీ రెమా రాజేశ్వరిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈసందర్బంగా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, అధికారులు ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకుసైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు.
లక్షన్నర మందిని తరలించడమే లక్ష్యం..
సీఎం పర్యటన సందర్భంగా గద్వాల్‌లో నిర్వహించే బహిరంగ సభకు లక్షన్న మందిని తరలించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక తెరాస నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలు, మండలాల వారీ కార్యకర్తలను తరలించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సుమారు లక్షన్నర మందిని బహిరంగ సభకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇదిలాఉంటే గద్వాల నియోజకవర్గ జన సవిూకరణకు మంత్రి లక్ష్మారెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్‌రెడ్డికి బాధ్యతలు తీసుకోగా.. అలంపూరు బాధ్యతలను మరో మంత్రి జూపల్లి కృష్ణారావుకు తీసుకున్నారు. ధరూరు మండలానికి తెరాస నేత బైకాని శ్రీనివాసయాదవ్‌, గట్టుకు అచ్చంపేట నేత రాములు, గద్వాల పట్టణానికి గువ్వల బాలరాజు, మల్దకల్‌కు కల్వకుర్తి నేత ఎడ్మ కృష్ణారెడ్డి, అయిజకు ఆంజయ్యయాదవ్‌, గద్వాల గ్రావిూణానికి మర్రి జనార్దన్‌రెడ్డి, ఇటిక్యాలకు బాద్మి శివకుమార్‌, వడ్డేపల్లి.. రాజోలి మండలాలకు జైపాల్‌ యాదవ్‌, ఉండవెల్లి.. మానవపాడు మండలాలకు కసిరెడ్డి నారాయణరెడ్డిలకు
జనసవిూకరణ బాధ్యతలు అప్పగించారు. వీరు ఆయా మండలాల పరిధిలోని స్థానిక నేతలను, ప్రజాప్రతినిధులను పూర్తిస్థాయిలో సమన్వయం చేసి ముఖ్యమంత్రి సభకు భారీగా జనాన్ని తరలించటానికి కృషి చేస్తున్నారు. బహిరంగ సభకు జోగులాంబ గద్వాల జిల్లా నుంచే కాక సరిహద్దులో ఉన్న ఇతర జిల్లాల పరిధిలోని మండలాల నుంచి కూడా జనం తరలివచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల నేతలు సైతం జనసవిూకరణలో నిమగ్నమై ఉన్నారు. సభకు 1.50 లక్షల జనాన్ని తరలించాలని ఇప్పటికే తెరాస అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.  సభ జరిగే సమయంలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాటర్‌ప్రూఫ్‌ షామియానాలతోపాటు సభావేదిక మొత్తం పకడ్బందీగా ఏర్పాటు చేశారు.