నేడు జిల్లా వ్యాప్తంగా చెకుముకి సైన్స్ పరీక్ష
జన విజ్ఞాన వేదిక – తెలంగాణ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి పరీక్షను నేడు నిర్వహిస్తున్నట్లు జెవివి జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నతనం నుండే విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడానికి 8 , 9 , 10వ తరగతి విద్యార్థులకు వారి పాఠశాలల్లోనే ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ , ప్రైవేట్ , రెసిడెన్షియల్ పాఠశాలల్లో చెకుముకి పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.జన విజ్ఞాన వేదిక సమన్వయకర్తల ద్వారా ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇంగ్లీష్ , తెలుగు మీడియం ప్రశ్నా పత్రాలను వేర్వేరుగా పంపిణీ చేసినట్లు తెలిపారు.40 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడిన ఈ పరీక్షను ఒక గంట వ్యవధిలో నిర్వహించాలని సూచించారు.ప్రథమ స్థానం పొందిన విద్యార్థులను మీడియం వారీగా ఒక జట్టుగా ఏర్పరిచి, ఈనెల 22న జరిగే మండల స్థాయి చెకుముకి పోటీలకు ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాలని కోరారు.మండల స్థాయికి ఎంపికైన విద్యార్థుల వివరాలను జనవిజ్ఞాన వేదిక సమన్వయకర్తలకు ప్రధానోపాధ్యాయులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.