రేపు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు
పోలింగ్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు
ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు
కరోనా నేపథ్యంలో ప్రత్యేకచర్యలు తీసుకున్న అధికారులు
సిద్దిపేట,నవంబర్2(జనంసాక్షి): సిద్దిపేటలో దుబ్బాక ఉప ఎన్నిక రంగం సిద్దం అయ్యింది. ప్రచార¬రు ముగిసిన వెంటనే నేతలు ఇంటింటా ప్రచారంతో గెలుపు కోసం యత్నించారు. మంగళవారం జరుగనున్న ఉప ఎన్నిక లపోలింగ్‌కు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలీసులు పక్కాబందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. దుబ్బాక పోరులో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో ఇరవై మంది బరిలో ఉన్నారు. మంగళవారం దుబ్బాకలో పోలింగ్ జరగనుండగా.. 10న కౌటింగ్ చేపట్టి ఫలితం వెల్లడించనున్నారు. దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరుగునుండగా, స్థానికేతరులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీపడుతున్నారు. ఈ నెల 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.నియోజకవర్గంలో లక్షా 98 వేల 756 మంది ఓటర్లున్నారు. అధికారులు 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 89 కేంద్రాలను సమస్యాత్మకంగా పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే
సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్ నుంచి రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3న ఉప పోలింగ్ జరుగనుండగా 10న ఓట్ల లెక్కింపు నిర్వహించారు.
ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. ఇందులో 98028 మంది పురుషులు, 100719 మహిళలు ఓటు హక్కు వినియోగించు కోబోతున్నారు. ఈ ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నిక నిర్వాహణకు 5,000 సిబ్బందిని నియామకం చేశారు.
అలాగే 315 బూత్‌లు, 89 సమస్యాత్మక కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. కోవిడ్ నిబంధనలతో ఈ పోలింగ్ జరగనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి భారతి ¬లికేరి పిలుపునిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్లు, ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉప ఎన్నికలో మొత్తంగా 315 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి పోలింగ్ బూత్‌లో కొవిడ్ నిబంధనాలు పాటించేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు. పోలింగ్ పక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటరుకు ఓటరుకు మధ్య భౌతికదూరం పాటించేలా 5 విూటర్లు దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా వీల్ చైర్లు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఆ ప్రాంతంలో పని చేసే అందరికి సెలవుదినంగా ప్రకటించామని తెలిపారు. కరోనా వైరస్ తీవ్ర ప్రభావం అవకాశం ఉన్నందున ప్రతి పోలింగ్ కేంద్రంలో థర్మల్ స్క్రీనింగ్ పరికరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ స్క్రీనింగ్ ఎవరికైనా జ్వరం ఉన్నట్టు అనిపిస్తే వారికి ఓటు హక్కును పోలింగ్ చివరి గంటలో వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పోలింగ్ అధికారులకు థర్మల్ స్క్రీనింగ్ చేయన్నుట్లు తెలియజేశారు. అధికారులకు జ్వరం ఉంటే ప్రత్యామ్నాయంగా ఇద్దరు అధికారులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు సంతకం చేస్తారు కాబట్టి వారికి గ్లౌజు అందిస్తున్నట్లు వివరించారు. ఒకవేళ కోవిడ్ బాధితులు అయితే వారు పీపీఈ కిట్లను ధరించి ఓటు వేయాలని సూచించారు.
ఈ ఉప ఎన్నికలో వందశాతం ఓటింగ్ జరగడానికి అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలియజేశారు. ఓటింగ్ శాతం పెంచేలా గ్రామగ్రామాన జానపద కళాకారులతో అవగాహన కల్పించామని చెప్పారు. అంతేకాక పోస్టల్ బ్యాలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఓటు వేసే వారి వద్దకు అధికారులు ప్రత్యేకంగా వెళ్లి ఓటు వేసే పక్రియను వీడియో తీసి, ఆ బ్యాలెట్‌ను సీల్ వేసి బాక్స్‌లో వేయిస్తున్నట్లు చెప్పారు. దుబ్బాక నియోజకవర్గం మొత్తంగా 1,98,756 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 1,00,778 మంది మహిళ ఓటర్లు, 97,978 పురుషులు ఉన్నట్లు తెలిపారు. దుబ్బాక పరిధిలో మొత్తంగా 315 పోలింగ్ కేంద్రాలున్నాయని, ఇందులో 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని పోలీస్ కమిషనర్ జోయెల్ తెలిపారు. ఈ సమస్మాతక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఉప ఎన్నికకు 2,000 వేల మంది బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ భద్రత బలగాలు ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద, ప్రతీ సెక్టార్ అధికారులతో స్ట్రాంరూంల వద్ద తదితరల ప్రాంతాల్లో బలగాలు ఉంటాయన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతంను తెలియ జేస్తామన్నారు. ఈ నెల 3 న పోలింగ్ నేపథ్యంలో
దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే ప్రతి ప్రదేశంలో 144 సెక్షన్ అమలు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందు 144 సెక్షన్ పూర్తిగా అమలులోకి తెచ్చారు. ఒకే చోట నలుగురు ఐదుగురు గుమిగూడి ఉండరాదని తెలిపారు. అంతేకాక ఇతర ప్రాంతాల నుంచి ప్రచార నిమిత్తం వచ్చిన వారు దుబ్బాక పరిధిలో కనిపించరాదని సూచించారు. దుబ్బాక పరిధిలో మొత్తంగా 10 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.