నేడు దేశవ్యాప్తంగా 24 గంటల పాటూ వైద్య సేవలు బంద్‌


ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటన
న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): కోల్‌కతాలోని ఆర్‌జి కర్‌ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్‌ డాక్టర్‌ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్‌ డాక్టర్‌ హత్యకేసులో నిందితులను శిక్షించాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడు రోజులుగా ఆరోగ్య సేవలు స్తంభించగా, తోటి విద్యార్థికి న్యాయం చేయాలంటూ జూనియర్‌ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్‌ పేషెంట్‌, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.కాగా, ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్‌ బోస్‌ సంబంధిత జూనియర్‌ వైద్యులతో మాట్లాడారు. దేశంలోని అన్ని నగరాల్లో వైద్యులు నిరసనలు తెలుపుతున్నారు. విధుల నుంచి బహిష్కరించిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైనీ డాక్టర్‌ హత్యకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. 17వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు అర్ధరాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు జూనియర్‌ డాక్టర్‌ హత్యపై పశ్చిమ బెంగాల్‌ అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళా స్వాతంత్య్రం కోసం నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అర్ధరాత్రి మహిళలు నిరసన తెలిపారు. ఆందోళనకారులుగా చెప్పుకుంటున్న దాదాపు 40 మంది వ్యక్తులు గురువారం అర్ధరాత్రి %RG% కార్‌ హాస్పిటల్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారులు ఆస్పత్రి ఆవరణలోకి చేరుకుని అత్యవసర విభాగం, నర్సింగ్‌ స్టేషన్‌, మందుల దుకాణం, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.