నేడు నాలుగు పథకాలకు శ్రీకారం

` కొడంగల్‌ నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్‌
` అర్హుల్లో ఒక్కరికి అన్యాయం జరగొద్దు..అనర్హులకు చోటు దక్కొద్దు
` గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక
` పథకాల అమలుపై అధికారులు, మంత్రులతో సిఎం రేవంత్‌ సవిూక్ష
` గ్రామానికో అధికారి చొప్పున పథకాల అమలుకు ఆదేశాలు
హైదరాబాద్‌(జనంసాక్షి):గతంలో హావిూ ఇచ్చిన విధంగా ఆదివారం నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రులు, అధికారులతో ఆయన పథకాల అమలుపై సవిూక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గ్రామాల్లోని లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజమైన లబ్దిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగవద్దని సూచించారు. అనర్హులకు లబ్ది చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు నాలుగు పథకాలను తెలంగాణ సర్కార్‌ లాంఛనంగా ప్రారంభించనుంది. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నాలుగు పథకాలకు ఒక్కో పథకానికి ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి నలుగురు మండలస్థాయి అధికారులను నియమించాలని తెలిపింది. ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో లబ్దిదారులకు పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మార్చి 31 లోపు నాలుగు పథకాలు వంద శాతం అమలు జరిగేలా చూడాలి.. నిజమైన లబ్దిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు.. అనర్హులకు లబ్ది చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని సర్కార్‌ హెచ్చరించింది. సంక్షేమ పథకాల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. లబ్దిదారుల వెరిఫికేషన్‌ కోసం గ్రామసభలు నిర్వహించామని, ఇచ్చిన హావిూ మేరకు రేపటి నుంచి పథకాల ప్రారంభిస్తామన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌ రావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క విూడియాతో మాట్లాడారు. పవిత్రమైన గణతంత్ర దినోత్సవం రోజున ఇచ్చిన మాట ప్రకారం నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నామన్నారు. మండలానికి ఒక గ్రామం యూనిట్‌గా తీసుకొని నాలుగు పథకాలు అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు అందిస్తామని, మార్చి వరకు పక్రియ పూర్తి చేస్తామని భట్టి స్పష్టం చేశారు. పథకాల్లో ఎలాంటి సీలింగ్‌ లేదని, అర్హులందరికీ అందిస్తామన్నారు. ఇండ్లు, రేషన్‌ కార్డుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు. వ్యవసాయం చేసే ప్రతీ ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని భట్టి వివరించారు. నాలుగు కొత్త పథకాలు ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని చెప్పారు. గ్రామాల్లో పథకాల కోసం లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు. నవరి 26 నుంచి ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని చెప్పారు. వ్యవయసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇస్తామన్నారు. రేషన్‌ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు మంత్రి ఉత్తమ్‌. రేషన్‌ కార్డుల జారీ నిరంతర పక్రియ అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులు ఇస్తామని తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌
కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేపు నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. రేషన్‌ కార్డులు, ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇస్తామని అన్నారు. రేషన్‌ కార్డుల జారీ నిరంతర పక్రియ.. గతంలో దరఖాస్తు ఇచ్చినా, సర్వేలో వివరాలు ఇచ్చినా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోక పోయినా ఇప్పుడు ప్రజాపాలన కేంద్రాల్లో ఇవ్వండని అన్నారు. బీపీఎల్‌ కుటుంబాలందరికి రేషన్‌ కార్డులు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని పేర్కొన్నారు. గత పదేళ్ళుగా దొడ్డు బియ్యం ఇచ్చారు.. మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం రేషన్‌ కార్డు ద్వారా అందిస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఇకపై బయట ఆహార పదార్థాలు కొనుక్కోవాల్సి ఉండదని అనుకుంటున్నానన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భారతదేశంలో రికార్డు స్థాయిలో పంటలు పండిరచింది తెలంగాణ రైతాంగం అని అన్నారు. దేశంలోనే రూ.7525 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. 21వేల కోట్ల రైతు రుణమాఫీ, 3వేల కోట్ల రైతు భీమా కట్టామని తెలిపారు. రేపట్నుంచి రాహుల్‌ గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని రైతు భరోసా అమలు చేయబోతున్నా మని అన్నారు. వ్యవసాయం చేసే ప్రతీ ఒక్కరికీ రైతు భరోసా ఇస్తున్నాం.. 40 వేల కోట్లు ఒక్క సంవత్సరంలోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వందేళ్ల అవసరాలకు తగ్గట్లు ‘ఉస్మానియా’ నిర్మాణం
` ఆసుపత్రికి 31న ముఖ్యమంత్రి శంకుస్థాపన
` ఏర్పాట్లపై అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి):రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెల 31న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు బోధన సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినులకు వేర్వురుగా నిర్మించే హాస్టల్‌ భవనాల విషయంలోనూ పూర్తి నిబంధనలు పాటించాలని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి సీఎం సలహాదారు ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సవిూక్షించి పలు సూచనలు చేశారు. ఆసుపత్రి భవన నిర్మాణాలు, పార్కింగ్‌, ల్యాండ్‌ స్కేప్‌ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలి. అవసరమైన చోట ఇతర మార్గాలను కలిపేలా అండర్‌పాస్‌లు నిర్మించాలి. ??ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులు, విజిటర్స్‌ వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్‌గ్రౌండ్‌లో రెండు ఫ్లోర్లలో పార్కింగ్‌ ఉండాలి. డార్మిటరీ, ఫైర్‌ స్టేషన్‌, క్యాంటిన్‌, మూత్రశాలలు, ఎస్టీపీలు నిర్మించాలి. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా పిల్లలు విదేశాల్లో స్థిరపడిన వారు వచ్చేందుకు రెండు మూడు రోజులు పడుతోందని.. అప్పటి వరకు మృతదేహాలను భద్రపర్చేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్‌ సదుపాయాలతో నిర్మాణాలు ఉండాలి.అవయవాల మార్పిడి.. అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వీలుగా హెలీ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్‌ నిర్మాణం కూడా చేపట్టాలి. ఆసుపత్రిలో అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలే తప్ప ఆసుపత్రికి వచ్చామన్న భావన రాకుండా తీర్చిదిద్దాలి. ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో పలు మార్పులు చేర్పులను సూచించారు.

ఇది తెలంగాణ ప్రజలకు అవమానం
` పద్మ పురస్కారాల్లో వివక్షపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసంతృప్తి
` ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని యోచన
హైదరాబాద్‌(జనంసాక్షి): పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్‌ (పద్మవిభూషణ్‌), చుక్కా రామయ్య (పద్మభూషణ్‌), అందెశ్రీ (పద్మభూషణ్‌), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్‌ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి ఎ..రేవంత్‌ రెడ్డి చర్చించారు. తెలంగాణకు పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. తెలంగాణ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గద్దర్‌, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్నలను గుర్తించకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని సీఎం పేర్కొన్నారు. 139 మందికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీసం అయిదు పురస్కారాలు ప్రకటించకపోవడంపై సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు
హైదరాబాద్‌(జనంసాక్షి): పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మ శ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్‌ డి. నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్‌, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్‌, ప్రజా వ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగకు, కళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కే.ఎల్‌.కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి.. అంకితభావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యేందుకు కారణమయ్యాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలి
` దేశ ప్రజలకు సీఎం రేవంత్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలని అందుకు మూలాధారమైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ముఖ్యంగా మహిళల సాధికారత కోసం వారికి ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500 లకే సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ సహాయాన్ని రూ.10 లక్షలకు పెంపు వంటి సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగాల భర్తీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. వీటికి తోడు మరెన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందన్నారు.గణతంత్ర దినోత్సవ శుభదినాన ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషకరమైన పరిణామమని అన్నారు. రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకాల ప్రయోజనాలు అందాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణబద్ధులమై తెలంగాణను ప్రపంచ పటంలో ఆవిష్కరించాలన్న ఆశయంతో తెలంగాణ రైజింగ్‌ నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రసిద్ధి గాంచిన సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్‌ ను సమున్నత స్థానంలో చేర్చాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సమున్నత లక్ష్యంతో స్కిల్స్‌ యూనివర్సిటీ స్థాపన, అడ్వాన్స్‌ డ్‌ ట్రెయినింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఏటీసీ)ల స్థాపన వంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికామన్నారు. గణతంత్ర దినోత్సవ శుభదినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు, సమున్నత స్థాయిలో దేశాన్ని నిలిపిన మహనీయులు అందరినీ స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారి స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.