నేడు బిజెపి బృందం పర్యటన
నల్గొండ,ఏప్రిల్5(జనంసాక్షి): కరవుపై పరిశీలను ఏర్పాటయిన బిజెప కమిటీ బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర బృందం పర్యటించనుందని బిజెపి జిల్లా అధ్యక్షులు వీరెళ్లిచంద్రశేఖర్తెలిపారు. శాసనపక్ష నాయకులు లక్ష్మణ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే జయపాల్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్, నాయకులు శృతి, అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, జిల్లాకు చెందిన నాయకులు బృందంగా జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమాచారం సేకరిస్తారని అన్నారు. పరిస్థితులను నేరుగా పరిశీలిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తప్పుడు విధానాలనే తెరాస ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. కాలువలు తవ్వి కాంట్రాక్టర్లకు వేలాది కోట్ల రూపాయలు పంపిణీ చేయడమే దీనికి నిదర్శనమన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను తెరాస ప్రభుత్వం అప్పులపాలు చేసిందని ఆరోపించారు. ‘మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలైనా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర పథకాలను నీరుగార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను తన సొంత కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో కరవు సహాయ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతూ నివేదిక తయారు చేస్తామని అన్నారు. రుణ మాఫీ బకాయిలను ఏకకాలంలో చెల్లించి కొత్త రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలని వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న కరవును పరిశీలించేందుకు భాజపా నేతలు జిల్లాలో పర్యటించనున్నట్లు వీరెల్లి తెలిపారు.