నేడు భారత్‌కు గీత

3
– డీఎన్‌ఏ పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగింత

ఇస్లామాబాద్‌ అక్టోబర్‌ 25 (జనంసాక్షి):

దశాబ్దానికిపైగా పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన బధిర, మూగ అమ్మాయి గీత సోమవారంభారత్‌కు రానుంది. భారత్‌, పాక్‌ ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డీఎన్‌ఏ పరీక్షలు చేసిన తర్వాతే గీతను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత్‌కు చెందిన గీత తన ఎనిమిదేళ్ల వయసులో సరిహద్దు దాటి పాక్‌ వెళ్లిపోయింది. మాట్లాడటం, వినడం రాని గీతకు కరాచీలోని ఈదీ ఫౌండేషన్‌ ఆశ్రయం కల్పించింది. ఇటీవలే గీత తన కుటుంబం భారత్‌లో ఉంటుందని సైగల ద్వారా చెప్పడంతో రెండు దేశాల అధికారులు ఆమె తల్లిదండ్రులను వెతికే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బిహార్‌కు చెందిన ఓ కుటుంబం ఫొటోను గీతకు పంపగా, ఆమె తన కుటుంబసభ్యులను గుర్తుపట్టింది. దీంతో గీతను తన తల్లిదండ్రులకు అప్పగించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సోమవారం(అక్టోబర్‌ 26) గీత దిల్లీకి చేరుకుంటుంది. అక్కడ డీఎన్‌ఏ పరీక్షలు చేసిన అనంతరం గీతను ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఒకవేళ డీఎన్‌ఏ పరీక్ష విఫలమైతే ఆమెను ప్రభుత్వాధీనంలో సురక్షితంగా ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. గీతతో పాటు ఈదీ ఫౌండేషన్‌కు చెందిన నలుగురు ప్రతినిధులు దిల్లీకి రానున్నారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం వారు తిరిగి పాక్‌కు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.