నేడు మోదీతో జపాన్‌ ప్రధాని భేటీ

1

న్యూఢిల్లీ, డిసెంబర్‌11(జనంసాక్షి): భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబేకు ఢిల్లీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీతో షింజో అబే రేపు సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ – జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలిసి రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఇద్దరు ప్రధానులూ వారణాసిలో నిర్వహించే గంగా హారతిలో పాల్గోనున్నారు. షింజో భారత్‌కి మంచి మిత్రుడని.. భారత్‌-జపాన్‌ సంబంధాలపై షింజోకి ఉన్న ఆలోచనలు అద్భుతమైనవని మోడీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. షింజో పర్యటనలో ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్‌ ట్రెయిన్‌, పౌర అణు ఒప్పందంపై ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.

సుష్మతో జపాన్‌ ప్రధాని భేటీ

మూడు రోజుల పర్యటన కోసం జపాన్‌ ప్రధాని షింజో అబె భారత్‌ కు వచ్చారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న షింజోకు కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా స్వాగతం పలికారు. అనంతరం ఆయన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తో భేటీ అయ్యారు. ఆయన పర్యటనతో భారత్‌-జపాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతాయని సుష్మా ఆకాంక్షించారు. షింజో అబేకు స్వాగతం తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా వారణాసిలో జపాన్‌ ప్రధాని పర్యటించనున్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ సహా పలు ఒప్పందాలపై అంగీకారం కుదుర్చుకోనున్నారు.