నేడు సద్దుల బతుకమ్మ భారీగా ఏర్పాట్లు


హైదరాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువుటద్దం. ఆడపడుచులు 9 రోజులపాటు ఆటపాటలు, బతుకమ్మలతో సందడి చేస్తుంటే చూడడానికి రెండు కండ్లు సరిపోవు. తెలంగాణ ఆడపడచులకు మాత్రమే ప్రత్యేకమైన పండగ ఇది.  సంవత్సరానికి ఒకసారి వచ్చే ఇలాంటి పండుగలు అసాంతం కన్నుల పండువగా జరుపుకొని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. మహిళలు 9 రోజులపాటు బతుకమ్మలు పేర్చి, బొడ్డెమ్మను కొలిచి, గౌరమ్మకు ప్రత్యేక పూజలు చే యడం ఆనందకర విషయం. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బతుకమ్మ పండుగ ఆడపడుచులకు ఆనందాలను తెచ్చి పెట్టింది. బుధవారం జరిగే సద్దుల బతుకమ్మ మరింత ఇంపుని తేనుంది. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆటపాటలతో ఎంజాయ్‌ చేయడం సంవత్సరమంతా గుర్తుండి పోయేలా చేస్తుంది. ఇన్నాళ్లూ ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ బొడ్డెమ్మను మనసారా కొలిచారు.  అందరూ ఒక్కచోట చేరి సందడి చేశారు. బతుకమ్మ ఆటపాటలు, కోళాటాలతో హుషారెత్తించారు. కన్నులపండువగా సాగిన బతుకమ్మ సంబురం అందరినీ ఆకట్టుకుంది.  చివరిరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.  బంతి, చేమంతి తదితర పుష్పాలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడుకున్నాక బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.