నేడో రేపో కరువు మండలాలు ప్రకటిస్తాం

1

– వ్యవసాయశాఖ మంత్రి పోచారం

నిజామాబాద్‌ అక్టోబర్‌30(జనంసాక్షి): తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయినందున మరో రెండు రోజుల్లో కరవు మండలాలను ప్రకటిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం బీర్కూర్‌లో డ్వాక్రా మహిళలకు దీపం పథకం కింద మంజూరైన 1054 గ్యాస్‌ కనెక్షన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. వర్షాభావంతో బోర్ల కింద సాగుచేసిన వరి, మొక్కజొన్న, సోయా, పత్తి వంటి పంటలకు సరిగ్గా నీరందక ఎండిపోయాయన్నారు.

కరవు మండలాలను గుర్తించేందుకు కలెక్టర్లతో నియమించిన కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదికను అందజేసిందని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా రెండు రోజుల్లో కరవు మండలాలను ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.2వేల కోట్లతో రైతులకు ఇన్‌పుట్‌ రాయితీని అందజేస్తామన్నారు. క్షేత్రస్థాయి అధికారులతో పారదర్శకంగా సర్వే జరిపి వాస్తవంగా పంటనష్టం వాటిల్లిన రైతులకే పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా జేడీ యల్లన్న, ఆర్డీవో శ్యాంప్రసాద్‌ లాల్‌, డీఎస్పీ రామ్‌కుమార్‌, ఎంపీపీ మీనా, జడ్పీటీసీ సభ్యుడు కిషన్‌, సర్పంచ్‌ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.