నేను దేశభక్తున్ని
– నా వ్యాఖ్యలకు కట్టుబడ్డా
– ఆమీర్ ఖాన్
దిల్లీ నవంబర్ 25 (జనంసాక్షి): నేను దేశ భక్తున్ని దనీ ఎవరో ధృవికరీంచాల్సిన అవసరం లేదని ఆమీర్ ఖాన్ అన్నారు.
‘భారత్ నా మాతృభూమి, ఈ గడ్డపై జన్మించడం నా అదృష్టం’ అని బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ అన్నారు. అసహనంపై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. భారత్ విడిచి వెళ్లే ఉద్దేశం తనకు, తన భార్యకు లేదని స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తన ఇంటర్వ్యూను పూర్తిగా చూడనివారే తనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తనకున్న దేశభక్తికి ఎవరి కితాబు అవసరం లేదని అన్నారు.
భార్యను ముంబయి వదిలి వెళ్లమని అడిగినట్లు మీడియాలో వార్తలు..
బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్.. తన భార్య కిరణ్‌రావ్‌ని ముంబయి వదిలి వెళ్లమని అడిగినట్లు కొన్ని వార్తా వెబ్‌సైట్లలో వార్తలు ప్రచురితమయ్యాయి. ఆమీర్ దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బుధవారం కాన్పూర్ కోర్టులో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదయ్యింది. ముంబయిలోని ఆయన ఇంటి ముందు హిందూ సేన సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో తన భార్య, కొడుకు కొన్ని రోజుల పాటు ముంబయిలో ఉండటం మంచిది కాదని ఆమిర్ అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు వారు ఎక్కడికైనా వెళ్లాలని ఆయన సూచించినట్లు సమాచారం. సోమవారం ఓ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో ఆమీర్ ఖాన్ దేశంలో సహన శీలత తగ్గుతోందని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పలు సంఘటనల్ని చూసి తన భార్య కిరణ్ రావు తనను దేశం వదిలి వెళ్లిపోదామంటూ అడిగిందన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అవార్డులు వెనక్కిచ్చేస్తున్న వారికి మద్దతు తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది. పలువురు రాజకీయ ప్రముఖులతోపాటు, చాలా మంది నెటిజన్లు కూడా ఆయన వ్యాఖ్యలపై మండి పడ్డారు. ఆయనకు ఆమీర్‌ఖాన్‌గా గుర్తింపునిచ్చింది ఈ దేశమేనని పలువురు వ్యాఖ్యానించారు. మరికొందరేమో ఆయన అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న స్నాప్‌డీల్ యాప్ ఉత్పత్తుల్ని కొనడం మానేస్తున్నామని, యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నామని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ఈ దుమారం నేపథ్యంలో ఇప్పటికే ఆమీర్‌ఖాన్ ఇంటి వద్ద భద్రతనను కట్టుదిట్టం చేశారు.