నేను పార్టీ మారడంలేదు:జానారెడ్డి
హైదరాబాద్,డిసెంబరు 9 (జనంసాక్షి):కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని అంశాలను పరిశీలించి టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను అంతర్గతంగా చర్చిస్తామని.. దాన్ని బహిరంగపరచాలని కోరడం విూడియాకు తగునా అని ప్రశ్నించారు. టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం జానారెడ్డి విూడియాతో మాట్లాడారు. కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీలో అభిప్రాయాలు సేకరించి అందర్నీ ఒప్పించి హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అధ్యక్షుడిగా ఎవరి పేరు సూచించారని విూడియా ప్రతినిధులు ప్రశ్నించగా అంతర్గతంగా చర్చించిన విషయాలు బహిర్గతం చేయడం తన స్థాయికి తగదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈ సందర్భంగా జానారెడ్డి స్పష్టం చేశారు. తనను ఏ పార్టీ సంప్రదించలేదని చెప్పారు. తెరాస, భాజపా నేతలు సంప్రదింపులు జరిపారా? అని ప్రశ్నించగా.. విూతో ఎవరైనా సంప్రదించారా? అంటూ విూడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారు. అలా ఎవరైనా ఉంటే వారిని తన దగ్గరికి తీసుకొస్తే వారితో చర్చించాక మాట్లాడతానని జానారెడ్డి వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన బదులిచ్చారు.