నేపాల్‌లో భారత ఛానెళ్ల నిషేధం

5
న్యూఢిల్లీ,నవంబర్‌29(జనంసాక్షి): భారత్‌ నేపాల్‌ మధ్య సరుకు రవాణా ఆగిపోవడాన్ని  నిరసిస్తూ నేపాలో భారత ఛానెళ్లను నిలిపివేశారు. భారత్‌ నుంచి నేపాల్‌ సరకు రవాణా ఆగిపోవడంతో ఆ దేశంలో భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జాయింట్‌ మాదేశీ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో నేపాల్‌లోని కేబుల్‌ ఆపరేటర్లంతా కలిసి భారత ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. నేపాల్‌కు సరకు రవాణాను భారత్‌ ఉద్దేశపూరితంగానే అడ్డుకుందని వారు ఆరోపించారు. అందుకే  భారత ఛానళ్ల ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు కేబుల్‌ ఆపరేటర్లు ఈ సందర్భంగా తెలిపారు. నేపాల్‌కు వెళ్లే నిత్యావసర వస్తువులను తరలించే ట్రక్కులు సరిహద్దు వద్ద నిలిచిపోయాయి. అయితే భద్రతా కారణాల వల్ల మాత్రమే సరకు రవాణా నిలిచిపోయిందని భారత్‌ చెబుతోంది. ఈ విషయంపై నేపాల్‌లో భారత రాయబారి రంజిత్‌ రే మాట్లాడారు. ఇలాంటి ఆందోళనలు దేశంలో భారత్‌పై వ్యతిరేకతను ప్రోత్సహించేలా ఉన్నాయని.. ఇవి రెండు దేశాలకు హానికరమన్నారు. సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

భారత జవాన్లను విడుదల చేసిన నేపాల్‌

నేపాల్‌ భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్న 13 మంది భారత జవాన్లను (సశస్త్ర సీమా బల్‌) విడుదల చేశారు. ఎస్‌ఎస్‌బీ ఉన్నతాధికారులు నేపాల్‌ అధికారులతో

మాట్లాడి వారిని విడుదల చేయించారు.ఆదివారం ఉదయం భారత్‌-నేపాల్‌ సరిహద్దు అయిన బిహార్‌లోని కిషన్‌గంజ్‌ జిల్లాలో ఎస్‌ఎస్‌బీ జవాన్లు స్మగ్లర్లను వేటాడే క్రమంలో

నేపాల్‌ భూభాగంలోకి ప్రవేశించారు. నేపాల్‌ సరిహద్దు భద్రత సిబ్బంది భారత జవాన్లను అరెస్ట్‌ చేసి, జాపా జిల్లాలోని వారి స్థావరానికి తరలించారు. భారత ఉన్నతాధికారులతో

జోక్యంతో ఈ సమస్య సద్దుమణిగింది.