నేపాల్‌లో మరోమారు భూకంపం

2

ఖాట్మండ్‌, మే 2 (జనంసాక్షి):

వరుస భూకంపాలు నేపాల్‌ ను కుదిపేస్తున్నాయి. గత శనివారం మొదలైన భూకంపం వారం రోజుల తరవాత కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా శనివారం ఉదయం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి నష్టం సంభవించలేదు. నేపాల్‌లో గత శనివారం సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటి వరకు 6,624 మంది మృతిచెందగా, 14,025మంది క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనావేస్తున్నారు. వరుస భూ కంపాలతో నేపాలీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.  భూకంపంలో మృతిచెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.  ఈ భూకంపంలో మృతిచెందిన వారి సంఖ్య 6,624కు చేరింది. ఈమేరకు ఇవాళ నేపాల్‌ జాతీయ విపత్తు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 14,025 మంది క్షతగాత్రులైనట్టు వెల్లడించింది. కాగా గత శనివారం రిక్టర్‌స్కేల్‌పై 7.9గా నమోదైన భారీ భూకంపం దాటికి దేశంలో వేల మంది ప్రాణాలు కోల్పోయి లక్షలాది మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. దాదాపు రెండు లక్షల భవనాలు నేలమట్టం అయ్యాయి.

నేపాల్‌ బాధితుల సహాయార్థం ఫేస్‌బుక్‌లో ఏర్పాటు చేసిన ‘డొనేట్‌’ బటన్‌ ద్వారా పది మిలయన్‌ డాలర్ల విరాళాలు అందాయి. నేపాల్‌లో భూకంప బాధితులను ఆదుకోడానికి, దాతలు విరాళాలు ఇచ్చేందుకు ఫేస్‌బుక్‌లో డొనేట్‌ బటన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేవలం రెండు రోజుల్లో ఈ బటన్‌ ద్వారా 10మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 63కోట్ల రూపాయల విరాళాలు సేకరించినట్లు ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జూకర్‌బర్గ్‌ తెలిపారు. దీంతో పాటు ఫేస్‌బుక్‌ సంస్థ తరఫనె 2 మిలియన్‌ డాలర్ల విరాళాన్ని నేపాల్‌ బాధితుల సహాయార్థం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.