నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఏకే గోయల్‌

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ (ఎన్‌జీటీ) చైర్‌పర్సన్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోయల్‌ బాధ్యతలు స్వీకరించారు. జూలై 6న ఆయన సుప్రీం కోర్టు న్యామూర్తిగా పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన 5 ఏళ్ల పాటు ఎన్‌జీటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2010లో ఏర్పడిన ఎన్‌జీటీకి గోయల్‌ మూడవ చైర్‌పర్సన్‌. మొదటి చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ లోకేశ్వర్‌ సింగ్‌ పాంటా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రెండవ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ స్వతంతేర్‌ కుమార్‌ బాధ్యతలు నిర్వహించారు. అయితే జస్టిస్‌ స్వతంతేర్‌ కుమార్‌ పూర్తి కాలం విధులు నిర్వహించారు. కానీ జస్టిస్‌ లోకేశ్వర్‌ ఒక ఏడాది కాలం మాత్రమే పదవిలో ఉన్నారు. 2011లో ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌ లోకాయుక్తగా నియమితులయ్యారు. జస్టిస్‌ స్వతంతేర్‌ కుమార్‌ గతేడాది డిసెంబర్‌ 20నపదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అధికారికంగా ఆ పదవి ఖాళీగానే ఉంది. అయితే జస్టిస్‌ ఉమేష్‌ దత్తత్రేయ సాల్వి ఈ యేడాది ఫిబ్రవరి 13 వరకు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా పని చేశారు. అనంతరం జస్టిస్‌ జావెద్‌ రహీమ్‌ నామమాత్రపు చైర్‌పర్సన్‌గా నియామకమయ్యారు. 2014లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ గోయల్‌ నియామకమయ్యారు. సుప్రీం కోర్టు నుంచి పదవీ విరమణ పొందిన కొద్ది కాలంలోనే ఎన్‌జీటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

———