నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీ క్లీన్‌స్వీప్‌

5

– మయన్మార్‌లో సూకీ సునామీ

మయన్మార్‌, నవంబర్‌ 11,(జనంసాక్షి): నిర్భంధాన్ని ప్రజాస్వామ్యం తుంగలో తొక్కేసింది. నిరంకుశత్వాన్ని ప్రజాబీష్టం పొలిమేరల వరకు తరిమికొట్టింది. వెల్లువెత్తిన ప్రజాబి óప్రాయానికి బ్యాలెట్‌ బాక్స్‌ బెదిరిపోయింది. యావత్‌ ప్రజానీకం పూరించిన స్వేచ్ఛా శంఖారావానికి ఎన్నికల రణరంగమే తల వంచింది. నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీ క్లీన్‌ స్వీప్‌ నిర్భంధానికి, నిరంకుశత్వానికి ప్రపంచదేశాలు మయన్మార్‌ను ఓ ఉదాహరణగా చూపిస్తాయి. అలాంటిది ఇప్పుడు ప్రజాస్వామ్యానికి వేదికగా చూపించాల్సిన తప్పనిస్ధితి నెలకొంది. మయన్మార్‌ పోరాట యోధురాలు ఆంగ్‌ సాన్‌ సూకీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీ తాజా ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసింది. 91 పార్టీలు దిగిన ఎన్నికల రణరంగంలో విజయకేతనం ఎగురవేసింది.

తొలి రౌండ్‌ లో 56 స్ధానాలు కైవసం

తొలి రౌండ్‌ నుంచే హవా కొనసాగించిన నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీ 57 సీట్లలో 56 స్ధానాలను కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది. దిగువ సభలోని 45 సీట్లకు గాను 44 సీట్లు కైవసం చేసుకుంది. ఇంకా వెల్లడి కాని పూర్తిస్ధాయి ఫలితాల్లోనూ నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీనే సత్తా చాటుతుందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు.

చరిత్రాత్మక విజయం దిశగా ఆంగ్‌ సాన్‌ సూకీ

ఇక యాంగాన్‌ రాష్ట్ర అసెంబ్లీలోని 90 సీట్లలో 87 స్ధానాలను దక్కించుకున్న ఆంగ్‌ సాన్‌ సూకీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య విజయాన్ని నమోదు చేసిన ఆంగ్‌ సాన్‌ సూకీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు దేశమైన చైనాతో పాటు మరికొన్ని దేశాలు సూకీని పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి.