నైరుతి ప్రవేశంతో భారీగా వర్షాలు

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన వాతావరణశాఖ

కృష్ణాజిల్లాలో ఎడతెరిపిలేని వాన

న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నం సాక్షి): నైరుతి రుతుపవనాలు దక్షిణాదిన మరింత విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 48గంటల్లో కర్నాటకలోని దక్షిణ ప్రాంతం, కోస్తాంధ్ర, దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. దేశంలోని పలు రాష్ట్రాలకు వరద ముప్పు ఉందని తెలిపింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ రాష్టాల్రకు ఐఎండీ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 12వ తేదీ వరకు కొంకన్‌, గోవా, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఐఎండీ హెచ్చరికలకు స్పందించిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. ఇకపోతే కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి.జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని కోనేరు సెంటర్‌తో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం కారణంగా మసులా బీచ్‌ ఫెస్టివల్‌ ప్రచారం కోసం నిర్వహించాల్సిన 2కె రన్‌ వాయిదా పడింది. బీచ్‌ ఫెస్టివల్‌ విజయవంతం కోరుతూ తలపెట్టిన 2కె రన్‌లో పాల్గొనేందుకు ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి వీపీ సింధు మచిలీపట్నం వచ్చారు. అయితే రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి బందరు పట్టణంలోని పట్టణ ప్రధాన రహదారిపై మోకాలు లోతులో నీరు చేరింది. దీంతో రన్‌ వాయిదా వేయాలని మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవనాలు విస్తరించడం తో కృష్ణా జిల్లాలో వర్షాలు ఊపందుకున్నాయి. విజయవాడ గ్రావిూణ మండలంతో వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మండవల్లిలో అత్యధికంగా 13 సెం.విూ. వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే మచిలీపట్నంలో 11, గూడూరు 10 సెం.విూ. వర్షపాతం నమోదు అయ్యింది. చల్లపల్లి, పెదపారుపూడి, ముదినేపల్లి, పెనమూలూరులో 9 సెం.విూ, కోడూరులో 8 సెం.విూ. వర్షపాతం నమోదు అయ్యింది.