నోరు పారేసుకున్న హరీష్…
మెదక్ : సామాన్యులకు అండగా ఉండాల్సిన పాలకులు నోరుపారేసుకుంటున్నారు. ఆదుకోండి మహా ప్రభూ అని దీనంగా వేడుకుంటుంటే.. ఛీ పొమ్మంటూ చీదరించుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించండి అంటూ వినతిపత్రం ఇస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులకు అండగా నిలిచిన నేతలపై ఆగ్రహం వెళ్లగక్కాడు మంత్రివర్యుడు. చిర్రుబుర్రులాడుతూ తన అసహనాన్ని ప్రదర్శించారు.మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో ఆశావర్కర్లపై మంత్రి హరీష్‌రావు నోరు పారేసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వచ్చిన ఆయనకు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చేందుకు ఆశా వర్కర్లు ప్రయత్నించారు. ఇది చూసిన హరీష్‌రావు.. ‘మీరు ఆశావర్కర్లు అని తెలుసు.. మీ ఆశలు నిరాశలే. సక్కగా పని చేసుకోక ఎందుకొచ్చారు. మిమ్మల్ని మోదీ తొలగించారు… మాకేం సంబంధం లేదు’ అంటూ ఎద్దేవా చేశారు.అయితే ఆశా వర్కర్లతో వచ్చిన సీఐటీయూ మండల కార్యదర్శి బొల్లం యాదగిరి ఆశావర్కర్ల సమస్యలు చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న హరీష్‌రావు… నువ్వెవరంటూ ప్రశ్నించారు. తాను సీఐటీయూ నాయకుడినని చెప్పగా… సీఐటీయూ నాయకుడివి.. రాజకీయం చేస్తున్నావా అంటూనే… వీడ్ని లోపలేయండి అంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. వెంటనే పోలీసులు యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు.కార్మిక నేతలపై జులుం ప్రదర్శించిన హరీష్‌రావు వైఖరిని కార్మిక సంఘాలు ఖండించాయి. గోడు విన్నవించుకునేందుకు వచ్చిన తమను చిన్నచూపు చూశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరీష్‌రావు వ్యవహారశైలిని నిరసిస్తూ అనేకచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి ఇలా ప్రవర్తించడం దారుణమని ఆరోపిస్తున్నారు.