న్యాయం కోసం ప్రశ్నిస్తే కేసులా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం కోసం ఉద్యమించిన వారిని ప్రాసిక్యూషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి అద్దం పడుతోంది. రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ ప్రాంతానికి 42 శాతం కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ 24 మంది న్యాయవాదులు కోర్టు హాల్‌లో ఆందోళనకు దిగారు. వారిని ప్రాసిక్యూషన్ చేయాలని సూచిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 2348ని జారీ చేసింది. రాష్ట్ర జనాభాలో తెలంగాణలోని పది జిల్లాల జనాభా నాలుగున్నర కోట్లు. ఈ లెక్కన న్యాయవాదులు కోరిన 42 శాతం కోటా తక్కువే. ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమైన సచివాలయం, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, హైకోర్టులో అత్యధికులు సీమాంధ్ర ప్రాంతం ఉద్యోగులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరమూ లేదు. ఆయా ప్రాంతాలకు వెళ్తే మనకు స్వచ్ఛమైన తెలంగాణ పలరింపులు వినబడేది తక్కువే. అంతా ఆంధ్ర భాషే. ఈమాత్రం చాలదూ.. ఆయా ప్రాంతాల్లో సీమాంధ్రుల ఆధిపత్యం ఎంతలా ఉందో చెప్పడానికి. మన హైదరాబాద్‌లో మన ఉనికిని మనమే వెదుక్కునే దౌర్భాగ్యపు పరిస్థితిని నిరసిస్తూ న్యాయబద్ధంగా తమకు చెందాల్సిన వాటా కావాలని న్యాయవాదులు నిరసన తెలిపారు. అంతే తప్ప ప్రభుత్వ ఆస్తులనో, ప్రైవేటు ఆస్తులనో ధ్వంసం చేయలేదు. తమకు కాకపోయిన తర్వాతి తరం వారికైనా ఉపాధి దొరకాలనే తలంపుతోనే వారు ఆందోళన చేశారు తప్ప ప్రభుత్వ సొమ్మును దిగమింగలేదు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును దళారులకు దోచిపెట్టలేదు. మరి ఏం చేశారని వారిని ప్రాసిక్యూట్ చేయాలనుకున్నారు? తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన అందరికీ ఇదే గది పడుతుందని హెచ్చరించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమా ? శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్ అమలుకు అడ్డంగా తెగపడుతున్నారా ? అనే సందేహాలు సగటు తెలంగాణవాదులను చుట్టుముడుతున్నాయి. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 28న అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమావేశం జరుగకుండా ఎన్ని దారులున్నాయో అన్ని దారుల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు సీమాంధ్ర పార్టీలన్నింటికీ తెలంగాణపై వైఖరి చెప్పకతప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణవాదులను గందరగోళ పరిచేందుకు, సమస్యలను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర సర్కారు న్యాయవాదుల ప్రాసిక్యూషన్‌ను తెరమీదికి తెచ్చింది. దురదృష్టకరమైన విషయమేమిటంటే ఈ జీవో జారీ చేసిన హోం శాఖకు మంత్రిగా ఉన్నది తెలంగాణ ప్రాంతానికి సబితా ఇంద్రారెడ్డి. ఆమె హయాంలోనే తెలంగాణవాదులపై ఎన్నో దురాగతాలు జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీలు, వాటర్ క్యానన్లు, భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. విచక్షణారహిరంగా కొట్టి గాయపరిచారు. విద్యార్థినులనూ, మహిళలనూ విడిచిపెట్టలేదు. తెలంగాణ సాగరహారం సందర్భంగా ప్రయోగించిన భాష్పవాయుగోళాల్లో మోతాదు ఎక్కువై రాజిరెడ్డి అనే తెలంగాణ ముద్దు బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. అది అధికారికంగా బయటికి తెలిసినా అలాంటి గాయాలతోనే ఇంకా బాధపడుతున్న వారెందరో ఉన్నారు. వరంగల్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పుకునే అధ్యాపకుడు యాకూబ్‌రెడ్డిని నగర డీఎస్పీ పోలీస్‌స్టేషన్లన్నీ తిప్పి కొట్టాడు. ఆయన శరీరంలో గాయపడని భాగం లేదంటే పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యేడాది గడిచినా ఆయన ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. కోలుకుంటాననే ఆశ లేదని ఆయనే కన్నీటిని దిగమింగుకుంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఇలాంటి దురాగతాలు ఎన్నో జరిగాయి. తెలంగాణ ప్రాంత ఎంపీలను ఎన్నో సందర్భాల్లో అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. వారు కూడా ప్రజాప్రతినిధులే అనే స్పృహ కూడా లేకుండా వ్యవహరించారు. ఇవన్నీ సబితమ్మ పాలనలో మనవారికి జరిగిన కొన్ని అన్యాయాలు మాత్రమే. ఇంకా వెలుగులోకి ఘటనలెన్నో ఉన్నాయనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. రాష్ట్ర ప్రజల ఉమ్మడి ఆస్తిని కార్పొరేట్లకు కట్టబెట్టి లక్షలాది కోట్ల దుర్వినియోగానికి పాల్పడిన అవినీతి మంత్రులను కాపాడేందుకు కేబినేట్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్లు, దోపిడీదారుల పక్షమేనని అర్థం అవుతుంది. ప్రజల సొమ్మును తాతలు పంచి ఇచ్చిన ఆస్తిలా ఇతరులకు కట్టబెట్టే దోపిడీదారుల పాలనలో తెలంగాణ ప్రాంతం ఎన్నో వివక్షలు, అన్యాయాలు ఎదుర్కొంటోంది. దానిని ప్రశ్నించేందుకు గొంతెత్తేవారి కంఠాల్ని తెగనరకాలని దోపిడీదారులైన పాలకులు పోలీసు లాఠీలు, తూటాలు ఉపయోగించుకుంటున్నారు. ఈ పాలనలో ఇంకా కొనసాగితే మన హక్కులను పూర్తిగా కోల్పోయి పరాధీనం అయిపోతామేమో అనే అనుమానం కలుగుతుంది. ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఏర్పడితే తప్ప మనకు మనుగడ లేదు.