న్యాయవాదులకూ తప్పని నిర్భంధం

1

– ఒంటిమామిడి వద్ద అడ్వకేట్‌ జేఏసీ నేతల అరెస్టు

మెదక్‌,జులై 30(జనంసాక్షి):మొన్న కాంగ్రెస్‌, కోదండరామ్‌, ఇవాళ లాయర్ల జెఎసి….ఎవరు మల్లన్నసాగర్‌కు వెళ్తున్నా అడ్డుకుకోవడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. మల్లన్నసాగర్‌కు ఎవరు వెల్లాలన్నా దుర్లభం అయ్యేలా పోలీసులు పనిచేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన  తెలంగాణ లాయర్లను ఒంటిమామిడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, లాయర్ల మధ్య వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. తోపులాటలో హైకోర్టు అడ్వకేట్‌ ప్రసాద్‌బాబు కాలికి గాయం అయింది. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా లాయర్లు రోడ్డుపై బైఠాయించిన నిరసన చేపట్టారు. వెంటనే పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు సంఘీభావం తెలపడానికి బయలుదేరిన న్యాయవాదుల బృందాన్ని ఒంటిమిట్ట వద్ద ములుగు పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో న్యాయవాదులు అక్కడే ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు న్యాయవాదులను ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ వాహనం న్యాయవాదులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్‌బాబు అనే హైకోర్టు న్యాయవాది కాలు విరిగింది. దీంతో న్యాయవాదులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. తాము పరామర్శించడానికి వెళితే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామికమన్నారు. కావాలనే ఇలా చేయడం దారుణమన్నారు.అంతకు ముందు మెదక్‌ జిల్లా మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ కింద భూములు కోల్పోయిన రైతులను కలిసేందుకు  తెలంగాణ న్యాయవాదుల జేఏసీ యాత్రను జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్జెండా ఊపి ప్రారంభించారు. .ఈ  సందర్భంగా తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌పై  ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. ప్రజల అనుమానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.  మల్లన్నసాగర్‌ వెళుతున్నవారిని అరెస్ట్‌ చేయడం సరికాదని కోదండరామ్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని… ముంపు తగ్గించాలని ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు.  లాయర్ల యాత్రతో వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. ఎక్కడైనా డీపీఆర్‌ రూపొందించిన తర్వాతే ప్రాజెక్టులు కడతారని చెప్పారు. 2013 యాక్ట్‌, 123జీవోపై చర్చ అర్థరహితమని ఆయన అన్నారు. 2013 చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని కోదండరాం డిమాండ్‌ చేశారు.’మల్లన్న సాగర్‌కు నేరుగా జేఏసీయే ఆందోళన నిర్వహించింది. మేం ఏ దొంగలతోనూ సావాసం చేయడం లేదన్నారు.  మల్లన్న సాగర్‌ విషయంలో ఇప్పటికీ తాము డీపీఆర్‌ను బయట పెట్టాలని కోరుతున్నామని, డీపీఆర్‌తోనే ముందుకు పోవాలని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టు అయినా ప్రణాళికాబద్ధంగా పోవాలన్నారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని, తక్కువ ఖర్చుతో తక్కువ ముంపుతో నీళ్లిచ్చే మార్గం చూడాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు వ స్తాయని నిరుద్యోగులు ఎంతో ఆశించారని, ఆ స్థాయిలో నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 4వ తేదీన ‘తెలంగాణ రాష్ట్రం-ఉపాధి అంశాలు’ అన్న విషయంపై సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు.