న్యాయశాఖ పరిశీలనలో హైకోర్టు విభజన అంశం : వెంకయ్య

న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): హైకోర్టు విభజన అంశం న్యాయశాఖ పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విభజనపై న్యాయశాఖ కసరత్తు చేస్తోందని, ఇరు రాష్టాల్ర సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటామని వెంకయ్యనాయుడు తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాలు ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ తెరాస పక్షనేత జితేందర్‌రెడ్డి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ, ఏపీలో న్యాయవాదులు విధులు బహిష్కరించారని, వెంటనే హైకోర్టు విభజనకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సభ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైకోర్టును విభజించాలని రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 9 నెలలైనా హైకోర్టు విభజన జరగలేదన్నారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కోర్టు రిక్రూట్‌మెంట్‌లోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. హైకోర్టు విభజన జరగాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.  రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా న్యాయవాదులు హైకోర్టును విభజించాలని ఆందోళనకు దిగడం, తాజాగా సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. హైదరాబాద్‌లో తెలంగాణ న్యాయవాదులు సమ్మె నోటీసు ఇవ్వడం గత కొన్ని రోజులుగా కోర్టు విధులను బహిష్కరిస్తూ ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి మంగళవారం ఈ అంశంపై చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, అమెరికాలోని ఎన్నారైలకు ఇస్తున్న విధంగా గల్ఫ్‌ దేశాల్లోని ఎన్నారైలకు కూడా ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు కార్డులివ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి కోరారు. లోక్‌సభలో సోమవారం సిటిజన్‌షిప్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీఐఓ కార్డును ఓసీఐ కార్డుతో విలీనం చేయడానికి ఉద్దేశించిన సిటిజన్‌షిప్‌ సవరణల బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దీనిపై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ హైకోర్టు విభజన న్యాయవ్యవస్త పరిధిలో ఉందన్నారు.  హైకోర్టు విభజనకు సహకరిస్తామన్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్టాల్రకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అంశమై న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.