పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు

ఉగాది కానుకగా తొమ్మిది నిత్యావసరాలు చౌకధరకే
నవంబర్‌ నుంచి కరెంటు కష్టాలుండవ్‌ : సీఎం కిరణ్‌కుమార్‌
నల్గొండ, మార్చి 29 (జనంసాక్షి) :
రానున్న పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50శాతం సీట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఉగాది నుంచి తొమ్మిది నిత్యావసర వస్తువులను చౌకధరకే అందించనున్నట్టు వెల్లడించారు. సూర్యాపేటలో రూ. 18కోట్లతో నిర్మితమైన వ్యవసాయ మార్కెట్‌ యార్డును శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి, పాలేరు తాగునీటి పైపులైను పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సూర్యాపేటలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టిల కోసం రూ. 10వేల కోట్లు కేటాయించామన్నారు. బీసీల కోసం ఈ బడ్జెట్‌లో రూ.4,027 కోట్లు కేటాయించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీల ఉన్నతి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. మన వాకింగ్‌ ఫ్రెండ్‌ మాత్రం తాను అధికారంలో ఉన్నప్పుడు అది చేశాను.. ఇది చేశాను అంటున్నారన్నారు. ఆయన తన తొమ్మిదేళ్ల పదవి కాలంలో మొత్తం రూ.10,500 కోట్లు మాత్రమే బీసీల కోసం కేటాయిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదే 4,027 కోట్లు కేటాయించిందన్నారు. బీసీల కోసం ఎవరు పాటుపడుతున్నారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ప్రజలు చాలా తెలివైన వారు.. వారిని మోసం చేయడం ఎవరి తరం కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మోసం చేశారు.. అధికారంలో లేనప్పుడు మోసం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. మేము వాస్తవమే చెబుతాం.. వాస్తవమే మాట్లాడుతామని చెప్పారు. తనకు చాలా చిన్న వయస్సులో ముఖ్య మంత్రి పదవి దక్కిందన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు
యత్నిస్తున్నానన్నారు. ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టి ముందుకు సాగుతున్నానన్నారు. మహిళల కోసం ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేశామన్నారు. భారీగా నిధులు కేటాయించామన్నారు. మహిళల పేరిటే ఇళ్ల పట్టాలను ఇస్తున్నామని తెలిపారు. మన మహిళలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుండడం హర్షణీయమన్నారు. నల్గొండ జిల్లా ప్రజల స్వాగతాన్ని తాను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానన్నారు. ఉపాధి హామీ పథకం జోరుగా కొనసాగుతోందన్నారు. సూర్యాపేటలో నిర్మితమైన మార్కెట్‌యార్డు ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రూ.396.50 కోట్లతో సూర్యాపేటకు తాగునీటి కోసం శంకుస్థాపన పనులు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే దామోదర్‌ రెడ్డి మంత్రి కంటే ఎక్కువ అని కొనియాడారు. సూర్యాపేటకు తాగునీటి కోసం నిధులివ్వండి అని అడిగారు.. అందుకోసం 75 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నానన్నారు. అలాగే యువతులకు జూనియర్‌ కళాశాల కావాలని అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నానని చెప్పారు. డిగ్రీ కళాశాల అడిగారు. డిగ్రీ కళాశాల కావాలో.. పాలిటెక్నిక్‌ కావాలో.. ఐటిఐ కావాలో తేల్చి చెబితే.. వాటిల్లో ఏదొకటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సూర్యాపేటకు ప్రత్యేకంగా స్టేడియం మంజూరు చేస్తున్నానన్నారు. ఇరిగేషన్‌, మూసీ ప్రాజెక్టులను పరిశీలించి నివేదికలు అందాక నిధులు మంజూరు చేస్తానన్నారు. ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఆ కష్టాలను అధిగమించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా మన్నారు. నవంబర్‌లోగా రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యను అధిగమిస్తామన్నారు. ప్రస్తుతం 14శాతం విద్యుత్‌ లోటు ఏర్పడిందన్నారు. రైతుల కోసం, ప్రజల కోసం యూనిట్‌ రూ.12లకు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
సూర్యాపేట అభివృద్ధికి సహకరించండి : దామోదర్‌రెడ్డి
సూర్యాపేట అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరించాలని ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదరరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్‌యార్డు ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటైన బహిరంగసభలో తొలుత మాట్లాడారు. సూర్యాపేటలో మంచినీటి పథకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సూర్యాపేటకు పాలేరు రిజర్వాయర్‌ నుంచి మంచినీటి కోసం 71 కోట్ల రూపాయలను ఇవ్వాలన్నారు. తద్వారా నాలుగు మండలాల ప్రజలకు తాగునీరు లభ్యమవుతుందన్నారు. అలాగే ఉండవల్లి, తుంగతుర్తిలలో కూడా మంచినీటి కోసం ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. సూర్యాపేటకు కృష్ణా జలాలు వచ్చేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తాను కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు వాగ్దానం చేశానన్నారు. ఆ పధకం కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా నన్నారు. అందుకోసం 175 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటాయన్నారు. గతంలోనే ఇస్తామన్నారు. ఇప్పుడు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నల్గొండ జిల్లాను సస్య శ్యామలం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపైనే ఉందన్నారు. అనేక గ్రామాల్లో రోడ్లు లేవని, సిసి రోడ్ల నిర్మాణం కోసం నిధులివ్వాలని కోరారు. అంతేగాక సూర్యాపేట పట్టణంలో ఆరు బాలుర వసతి గృహాలు, ఐదు బాలికల వసతి గృహాలు ఉన్నాయని, వాటికి సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పాత మార్కెట్‌యార్డు స్థలం ఖాళీగా ఉందని, అందులో కొంత కేటాయిస్తే ఆయా వసతి గృహాల కోసం భవనాలు నిర్మిస్తామని, అనుమతి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. సూర్యాపేట ప్రజల కోరికలను నెరవేర్చాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ నల్గొండ జిల్లాకు రావడం.. మార్కెట్‌ యార్డు ప్రారంభించడం.. పలు శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం హర్షదాయకమన్నారు. ఇదొక శుభదినమని జిల్లా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి మోగించడం ఖాయమని, కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఆ దిశగా తాము కూడా కృషి చేస్తామని దామోదర్‌ రెడ్డి అన్నారు. అయారాం.. గయారాంలు వస్తుంటారు..పోతుంటారు..ఏవేవో మాట్లాడుతుంటారు.. వాటన్నింటిని పట్టించుకోవద్దన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రులు జానారెడ్డికి, సునీతా లక్ష్మారెడ్డికి, ఎంపి గుత్తా సుకేందర్‌రెడ్డికి రుణపడి ఉంటానని అన్నారు.
తెలంగాణ కోసం సహకరించండి : గుత్తా
తెలంగాణ రాష్ట్రం కోసం సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరుతున్నానని ఎంపి గుత్తా సుకేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపు తున్నానన్నారు. ఫ్లోరైడ్‌ నీటి నివారణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమకుమార్‌రెడ్డి, జానారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్‌, ఎమ్మెల్యే భిక్షపతిగౌడ్‌, డీసీసీబి చైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ఎన్‌.ముక్తేశ్వరరావు, జెసి హరిజవహర్‌లాల్‌, ఆర్డీవో వి. నాగన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్‌పి నవీన్‌ గులాటి, సూర్యాపేట డిఎస్‌పి టి.వెంకన్న నాయక్‌ పాల్గొన్నారు.