పంచాయితీరాజ్, అటవీ శాఖల మధ్య వార్
పరస్పర కేసులపై ప్రజల్లో తీవ్ర చర్చ
ఇరు శాఖలను కట్టడి చేయడంలో మంత్రి విఫలం
నిర్మల్,జూలై8( జనంసాక్షి): పంచాయితీరాజ్, అటవీ శాఖల మధ్య వార్ ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కానరవాడం లేదు. ఇరు శాఖల అధికారుల పట్టుదలకు పోయి పరస్పరం కేసులు నమోదు చేసుకోవడంతో ఈ సమస్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేగగాకుండా జిల్లాకు చెందిన మంత్రి కేవలం ఉత్సవ విగ్రహంగా ఉంటున్నారన్న ప్రచారం ఉంది. మొన్నీమధ్య బాసర ట్రిపుల్ ఐటిలో జరిగిన ఆందోళన సందర్బంలోనూ మంత్రి చొరవ తీసుకున్న దాఖలాలు కానరాలేదు. ఇప్పుడు సొంత జిల్లాలో రెండు శాఖల పంచాయితీని బజారుకెక్కకుండా ఆపలేకపోయారు. తాజాగా పంచాయితీ అధికారుల చర్యకు అటవీశాఖ ప్రతీకార చర్యకు దిగింది. తమ కార్యాలయానికి తాళం వేసి,కేసు పెట్టినందుకు ప్రతిగా ఇప్పుడు పంచాయితీ అధికారులపై అటవీశాక కేసు నమోదు చేసింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలోని దస్తూరాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామంలో ఎటువంటి అనుమతి లేకుండా అటవీశాఖ భూభాగంలో పంచాయతీరాజ్‌శాఖ అధికారులు క్రీడా ప్రాంగణాన్ని నిర్మించారని ఖానాపూర్ ఎఫ్‌డీవో కోటేశ్వరరావు అన్నారు. తమ భూ భాగంలో అనుమతులు లేకుండా క్రీడాప్రాంగణం నిర్మాణానికి బాధ్యులైన బుట్టాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై దస్తూరాబాద్ మండల ఎంపీవో, ఎంపీడీవోలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అంశంపై ఇదివరకే దస్తూరాబాద్ మండల ఎంపీడీవో గతంలో తమను సంప్రదిస్తే సంబంధిత స్థలంలో క్రీడాప్రాంగణం నిర్మాణానికి అనుమతించలేదన్నారు. అయినప్పటికీ అటవీశాఖ నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా సంబంధిత అధికారులు బుట్టాపూర్ శివారు ప్రాంతంలోని కోర్ ఏరియాలో క్రీడాప్రాంగణాన్ని నిర్మించడం సరికాదన్నారు. ఈ అంశంపై గత నెల 30వ తేదీన తాము దస్తూరాబాద్ మండల ఎంపీడీవోకు నోటీసులు జారీ చేశామన్నారు. ఆ నోటీసులలో ఏడు రోజుల వరకు సమయం కూడా ఇచ్చామన్నారు. అయినా సమాధానం రాకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఉద్యోగులు అటవీశాఖ చట్టాలపై అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇబ్బందుల పాలవ్వక తప్పదన్నారు. అటవీశాఖ భూ భాగంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్న ముందస్తుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సంబంధిత పనుల వివరాలను ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లి ఆ పనుల నిర్వహణకు అనుమతి వస్తుందో లేదో చెబుతామన్నారు. అటవీశాఖ
ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి విధులు నిర్వహిస్తున్నామన్నారు. అటవీశాఖ అనుమతి కోరిన తర్వాత ఇప్పటి వరకు 70 చోట్ల శ్మశాన వాటికలకు, 100 పల్లె ప్రకృతి వనాలకు తాను అనుమతించినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పుడు ఈ రెండు శాఖల మధ్య సమన్వయ లోపం ప్రజల్లో చర్చగా మారింది.