పంచాయితీలపై కన్నేసిన కొత్త ఎమ్మెల్యేలు
అనుచరులకు పదవులు కట్టబెట్టేందుకు రంగంలోకి
గ్రామాల్లో మొదలయిన పంచాయితీ సందడి
మహబూబ్‌నగర్,డిసెంబర్14(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపు విూదున్న టిఆర్‌ఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దం అవుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా సత్త చాటాలని చూస్తోంది. పూర్తిగా గ్రామ రాజకీయాల ఆధారంగా ఇవి జరుగనున్న పార్టీల ప్రభావం కూడా ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ఆశావహులు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. గతంలోనే ఎన్నికలు జరుగుతాయని భావించిన పలువురు ఆశావహులు వారి వారి గ్రామాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లోకివెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు వెలువడుతుండడంతో తిరిగి ఆశావహులు వారివారి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్ తరపున పోటీచేసేందుకు గ్రామాలలో ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం తమ తమప్రయత్నాలనుముమ్మరం చేస్తున్నారు. ఇటీవల తమ ఎన్నికల ¬రులో అలుపెరగకుండా శ్రమించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల వైపు తమ దృష్టిని మరల్చాల్సి వస్తుంది. ఒకవైపు మంత్రివర్గ విస్తరణ, ఇతర కార్యక్రమాలతోపాటు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాలు జరగకపోయినా ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారంతా సీఎం కేసీఆర్ ఆదేశాలతో తమ దృష్టిని గ్రామ పంచాయతీల ఎ న్నికల వైపు మళ్లిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా వారి వారి నియోజకవర్గాలకు చేరుకొని రిజర్వేషన్ల పక్రియ ఆధారంగా సర్పంచు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలోఅధికారులు ఆగమేఘాలపై ఆయా మండలాల్లోని గ్రామాలలో బీసీ ఓటర్ల గణనను నిర్వహిస్తున్నారు. ఈ పక్రియను ఒకటి, రెండ్రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఈ నెల 15న బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం గ్రామ పంచాయతీలకు సంబంధించి జరగనున్న ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికపై, బీసీలకు ఓటర్ల నమోదు ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. గతంలో పలు గ్రామ పంచాయతీలకు అమలైన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా నూతన గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రిజర్వేషన్ల సంఖ్య 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నూతనంగా ఏర్పడిన గిరిజన తండాలన్నింటిలోనూ గిరిజనులే సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎంపిక కానున్నారు. మిగిలిన వాటిలో మాత్రం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పక్రియను పూర్తి చేసేందుకు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు సన్నద్ధ మవుతున్నారు. దీంతో ఇక పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు జరగడానికి వేగంగా ఏర్పాట్లు సిద్ధమవుతు న్నాయి. కాగా సర్పంచుల పదవీ కాలం జూలై చివరి నాటికి ముగిసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా గణనను అధికారులు పూర్తి చేశారు. బీసీ ఓటర్ల గణన పక్రియను అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆయా మండలాల అధికారులు, సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. ఈనెల 15న బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పాత, కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలను రెండు విడుతలలో నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. 719 గ్రామ పంచాయతీలకు సర్పంచుల కోసం, 6,382 స్థానాల వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి.