పంచాయితీల్లో మన జెండా ఎగరాలి: ఎంపి

మెదక్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి):

వచ్చే పంచాయితీ ఎన్నికల్లో  ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగురవేద్దామని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.  ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారని వారిని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పటికి విస్మరించదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోను టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఎగురవేసేలా నాయకులందరు కలసికట్టుగా పనిచేద్దామన్నారు. ప్రతి గ్రామంలో కొత్త ఓటర్లను జాయిన్‌ చేయాలని సూచించారు.  సీఎం కేసీఆర్‌ అభివృద్ధి ఎజెండాను అమలు చేస్తున్నతీరు ప్రజల్లో మంచి పేరు వచ్చిందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి కార్యకర్తల కృషి అధికంగా ఉందన్నారు. నాయకులకంటే ఎక్కువ కష్టపడింది కార్యకర్తలేనన్నారు. సీఎం కేసీఆర్‌ తాను చేసిన అభివృద్ధిపై నమ్మకంతో ప్రజలముందుకు ముందస్తూగా వెళ్లారన్నారు. ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీని దీవించారన్నారు. మంత్రి కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత ప్రతి రోజూ తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులకోసం సమయం కేటాయిస్తున్నారన్నారు. కేటీఆర్‌ దృష్టి అంతా ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేయడంపై ఉందన్నారు. మరో వందేళ్లు టీఆర్‌ఎస్‌ పార్టీ నడిచేలా కార్యాచరణను అమలు చేస్తున్నారన్నారు. కార్యకర్తలు కొత్త ఓటర్లను కలసి వారి ఓటును నమోదు చేయిస్తే పార్టీకి అది బలంగా మారుతుందన్నారు.  సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి, టీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసీ ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారన్నారు. ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తితో  పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురాలన్నారు.