పంచాయితీల ఏకగ్రావాలకు పాటుపడాలి

అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిని చాటాలి
సిద్దిపేట,జనవరి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన మాదిరే అదే స్పూర్తి, పట్టుదలతో కార్యకర్తలు పని చేసి గ్రామ పంచాయతీపై గులాబీ జెండా ఎగురవేద్దామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ఆదరించిన ప్రజలు పంచాయితీ ఎన్నికల్లోనూ పట్టం కట్టాలన్నారు. అన్ని పంచాయతీలపై గులాబీ జెండా ఎగురవేయాలంటే ఆయా గ్రామాల కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచ్‌గా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకుంటే ఆ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థుల నే ప్రజలు ఆదరించాలని కోరారు. గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌ల అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో  వేలమెజార్టీ అందించారని, ఆ విజయం కార్యకర్తలు, నాయకులదే అన్నారు. పని చేసే కార్యకర్తకు తగిన ప్రాధాన్యత తప్పక ఉంటుందని, ఈ విషయాన్ని స్వయంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారని గుర్తు చేశారు. అదే పట్టుదలతో అన్ని గ్రామ పంచాయతీలపై గులాబీ జెండాలు ఎగురవేసి  సత్తాను మరోసారి చాటుదామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రతీ గ్రామ పంచాయతీపై గులాబీ జెండా ఎగురవేసి సిఎం కెసిఆర్‌కు కానుకగా ఇవ్వాలని  పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వం రూ. 10 లక్షల నిధులు అందిస్తుందన్నారు. దీంతో నూతన గ్రామ పంచాయతీలను ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. పార్టీకి విధేయులుగా ఉండి అభివృద్ధికి కృషి చేసిన వారికి తప్పకుండా సర్పంచ్‌ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారన్నారు. ఆదర్శంగా తీసుకుని  గ్రామాలను ఏకగ్రీవం చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.