పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం

తండాల్లోనూ ఎన్నికల కళ
మహబూబ్‌నగర్‌,మే17(జ‌నం సాక్షి):  గ్రామ పంచాయతీ ఎన్నికలను సకాలంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.  అధికారంలోకి రాకముందు సీఎం కేసీఆర్‌ ఎన్నికలలో అర్హత గల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతామని హావిూ ఇచ్చిన సంగతి విదితమే. దీంతో  జిల్లాలో గ్రామ పంచాయతీలుగా అర్హత సాధించిన తండాలు వచ్చే ఎన్నికలలో పంచాయతీలుగా మారనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారులు నివేదికలు పంపించారు.  గ్రామ పంచాయతీగా ఏర్పడిన తరవాత తండాలు స్వయంగా పాలించుకోవడానికి ప్రభుత్వ నిధులతోపాటు స్థానికంగా ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆ తండాలకు సరిహద్దులు, సర్వే నంబర్లు, చెరువులు, బావులు, రహదారులు తదితర వాటిని కల్పించాలి. అందుకోసం గత రెండేళ్ల నుంచి ఈ పక్రియ మొత్తం పూర్తయింది. జిల్లా నుంచి అర్హత గల గ్రామ పంచాయతీలుగా మారిన  తండాల జాబితాలను పంచాయతీ ఎన్నికల్లో చేరుస్తారు.  ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 64 మండలాల పరిధిలో 1348 గ్రామ పంచాయతీలు ఉండేవి. కాని 7 మండలాలు రంగారెడ్డి జిల్లాలో, మూడు మండలాలు వికారాబాద్‌ జిల్లాలో కలిసి పోయాయి. వీటి పరిధిలో 200 గ్రామ పంచాయతీలు అందులో కలిశాయి. వీటితో పాటు గ్రామ పంచాయతీలకు అర్హత సాధించే 53 తండాలు వీటి పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 83 తండాలు గ్రామ పంచాయతీలుగా అర్హత సాధించాయి. తరువాత నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో తక్కువ మొత్తంలో తండాలు ఉన్నాయి.
…………………..