పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆప్‌ల హవా

1234

– భాజపా కూటమికి చావుదెబ్బ

– ఒపీనియన్‌ పోల్స్‌ వెల్లడి

చండీగఢ్‌,అక్టోబర్‌ 14(జనంసాక్షి): వచ్చే ఏడాది జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి శిరోమణి అకాలీదళ్‌, బీజేపీ కూటమికి పరాజయం తప్పదా? ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా మెజార్టీ సాధించే అవకాశం లేదా? యాక్సిస్‌-ఇండియా టుడే నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ ప్రకారం పంజాబ్‌లో  హంగ్‌ ఏర్పడనుంది. మొత్తం 117 సీట్లున్న పంజాబ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం అకాలీదళ్‌కు 56, బీజేపీకి 12 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్కు 46 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు స్వతంత్ర సభ్యులున్నారు.

యాక్సిస్‌-ఇండియా టుడే ఒపీనియల్‌ పోల్‌ ప్రకారం పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. కాంగ్రెస్‌కు  49 నుంచి 55 సీట్లు రావచ్చు. అయితే గత ఎన్నికల కంటే కాంగ్రెస్‌ ఈసారి ఎక్కువ సీట్లు గెలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ (59) సాధించకపోవచ్చు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశముంది. ఆప్‌ 42-46 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలవవచ్చు. కాగా అధికార అకాలీదళ్‌-బీజేపీ కూటమి కేవలం 17 నుంచి 21 సీట్లు గెలిచే అవకాశముందని సర్వేలో తేలింది. ఇతర పార్టీలు 3 నుంచి 7 సీట్లు గెలవవచ్చు. ఇక బీజేపీకి రాజీనామా చేసి.. కొత్త పార్టీ పెట్టిన మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ నవ్జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. రైతుల ఆత్మహత్యలు, డ్రగ్స్‌ అక్రమ సరఫరా వంటి అంశాలు అధికార కూటమిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక యూపిలోనూ అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించినా అధికరాం కష్టమేనని అంటోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారం సాధించాలన్న బీజేపీ కల సాకారమవుతుందా? అధికార సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ మెజారిటీ సాధిస్తుందా? అంటే యాక్సిస్‌-ఇండియా టుడే సర్వే ప్రకారం ఈ రెండూ జరగకపోవచ్చు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌/-లో  హంగ్‌ ఏర్పడుతుందని సర్వేలో తేలింది. గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేసిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో జోరు తగ్గినా అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో అధికారం సాధించాలంటే 202 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇండియా టుడే సర్వే ప్రకారం బీజేపీ 170 నుంచి 183 సీట్లు గెలిచే అవకాశముంది. ఇక అధికార సమాజ్వాదీ పార్టీకి పరాజయం తప్పకపోవచ్చు. ఎస్పీ 94-103 సీట్లు గెలిచి మూడో స్థానంలో నిలవనుంది. ఇక బీఎస్పీ 115 నుంచి 124 సీట్లు సాధించే అవకాశముంది. కాంగ్రెస్కు 8 నుంచి 12, ఇతరులకు 2 నుంచి 6 సీట్లు రావచ్చు.