పంటనష్టం అంచనాలో అధికారులు

మార్కెట్‌ యార్డుల్లో తడిసి ముద్దయిన ధాన్యమే ఎక్కువ
సూర్యాపేట,మే4(జ‌నం సాక్షి): అకాల వర్షంతో పంటనష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నారు. మరోమారు వర్షాలు పడే అవకాశం ఉండడంతో మార్కెట్లలో ధాన్యం మరోమారు తడవకుండా చూడాలని ఆదేశాలు అందాయి. మూడు నెలల్లో వరుసగా మూడుసార్లు వరుణుడు అనువుగాని సమయంలో తన ప్రభావం చూపడంతో అన్నదాతకు అపార నష్టం కలిగింది. దాదాపు లక్ష ఎకరాల్లో పంటకు తీవ్రం నష్టం కలిగింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 90 శాతానికి పైగా కోతలు పూర్తయ్యాయి. 40 నుంచి 50 శాతం ధాన్యాన్ని అమ్ముకుని రైతులు సొమ్ము చేసుకున్నారు. మిగిలిన యాభై శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. పలు కారణాలతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ధాన్యమంతా కొనుగోలు కేంద్రాల్లో ఉండటం.. అదే సమయంలో వర్షం కురవడంతో తీవ్రనష్టం కలిగింది.ఈ యాసంగి పంట సీజనులో ఇప్పటికి పలుమార్లు ప్రభావం చూపి అపార నష్టం కలిగించింది. మార్చి నెలాఖరులో పంట కోతలు ఆరంభమయ్యే సమయంలో వడగండ్ల వాన కురవడంతో పంట నేలపాలు ఈదురుగాలుల, రాళ్ల దాడికి గింజలు రాలిపోయాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో మరోసారి తన ప్రభావాన్ని చూపింది. ఈసారి కల్లాల్లో ఆరబెడుతున్న ధాన్యం, ఇపుడిపుడే మార్కెట్టు యార్డులకు వస్తోన్న ఉత్పత్తులకు నష్టం వాటిల్లింది. తాజాగా గురువారం ఈదురుగాలుతో కూడిన భారీవర్షం సూర్యాపేట, నల్గొండ జిల్లాలను కుదిపేసింది.  దాదాపు రెండు నుంచి నాలుగు గంటలపాటు భారీవర్షం కురియడంతో  కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యమంతా తడిసింది. నల్గొండలో 212, సూర్యాపేటలో 111 ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. నల్గొండ, శాలిగౌరారం, చిట్యాల, నిడమనూరు, పీఏపల్లి, కట్టంగూరు, జాజిరెడ్డిగూడెం, నాగారం, పెన్‌పహాడ్‌, సూర్యాపేట, కోదాడ, మునగాల, మోతె మండలాల పరిధిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో తీవ్రమైన నష్టం జరిగింది. వీటి పరిధిలో దాదాపు 65 వేల బస్తాల ధాన్యం కొనుగోళ్ల కోసం ఉందని అధికారులు అంచనా వేశారు. భారీ వర్షం కురవడం, ఈదురుగాలులు బలంగా వీచడంతో రాసులపై కప్పిన పట్టాలు లేచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో నీరంతా చాలాసేపు ధాన్యం రాసుల మధ్యలోనే నిలిచింది. మార్కెటింగ్‌ శాఖలో
సిబ్బంది కొరత ఉండటంతో ధాన్యం నష్టంపై అధికారులు సరైన అంచనాకు రాలేకపోతున్నారు.
బి తిరుమలగిరి, సూర్యాపేట మార్కెట్టు యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. తిరుమలగిరిలో భారీవర్షం కురవడంతో కుప్పకు బస్తాకు తగ్గకుండా ధాన్యం వర్షం నీటితోపాటు కొట్టుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా మార్కెట్టులో వందకు పైగా రాసులున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సూర్యాపేట కలెక్టర్‌ సురేంద్ర మోహన్‌ మార్కెట్టుకు వెళ్లి స్వయంగా అక్కడి పరిస్థితిని సవిూక్షించారు.తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కోనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేయగా.. అక్కడే వ్యాపారులతో మాట్లాడి ఒప్పించారు.
——————–