పంటలు కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి
వరంగల్,జనవరి23(జనంసాక్షి): జిల్లాలో పంటలను కాపాడేందుకు గాను వెంటనే దేవాదులనీటిని పంపింగ్ చేసి ఆదుకోవాలని, ఇందుకోసం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రైతాంగం అధికారులను కోరుతోంది. ప్రస్తుతం దేవాదుల ఎత్తిపోతల ద్వరా ఎస్‌ఆర్‌ఎస్పీ ఎల్‌ఎండి కాకతీయ కాలువ ద్వారా నీటి లభ్యతను బట్టి తాగునీటి సరిపడా నిల్వచేసి ఆతర్వాత ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకున్నారు. దేవాదుల పంపింగ్ ద్వరా ధర్మసాగర్ చెరువు కింద దక్షిణ ఉత్తర కాలువ ద్వారా వారబందీ ద్వారా రైతాంగానికి నీరు విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకోవడంతోపాటు నీటి లభ్యతననుసరించి నీటిని జాగ్రత్తగా ప్రతి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీటి విడుదల సందర్బంగా అక్రమంగా గండి కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని మరోవైపు అధికారులు హెచ్చరించారు. ఇదిలావుంటే పాకాల ఆయకట్టు కింద యాసంగి సాగు కోసం రైతులు పోటీ పడుతున్నారు. తైబందీ ఖరారైన సంగెం, తుంగబంధం రైతులతో తైబందీపై స్పష్టతలేని జాలుబంధం రైతులు ఘర్షణకు దిగుతున్నారు. గత మూడు రోజులుగా జాలుబంధం కాలువకు నీళ్లు వెళ్లకుండా సంగెం, తుంగబంధం రైతులు అడ్డుకట్టవేయడం వెంటనే జాలుబం ధం రైతులు తొలగించడం నిత్యకృత్యమైంది. రోజురోజుకీ ఇరువర్గాల రైతుల మధ్య పంతాలు పట్టింపులు పెరిగిపోతున్నాయి. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సమస్య జఠిలం కాకముందే పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి వారికి నచ్చజెప్పి విషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఇరువర్గాల రైతులు నర్సంపేట ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు.