పంటల బీమా పథకంపై అనాసక్తి

మెదక్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పంటల బీమా పథకం రైతుల ఆదరణ కోల్పోతున్నది. సత్ఫలితాన్నిస్తుందని భావించి రూపకల్పన చేసిన పంటల బీమా పథకం అమలులో చిత్తశుద్ధి లోపించడంతో రైతులకు ప్రయోజనం చేకూరడం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం అందించడంలో బీమా కంపెనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేయడంతో రైతులు ఈ పథకం పట్ల ఆసక్తి చూపడం లేదు. పరిహారం మంజూరైనా రైతుల చేతికి పరిహారం నిధులు ఎప్పుడు అందుతాయో తెలియని దుస్థితి నెలకొన్నది. బీమా చేసిన రైతులకు ఎదురైన చేదు అనుభవాలను చూసిన రైతులు ప్రస్తుత సీజన్‌లో ఈ పథకంలో చేరేందుకు మొగ్గుచూపడం లేదని తెలుస్తున్నది. జిల్లా యూనిట్‌గా పరిగణిస్తున్న పత్తి పంటకు కూడా కేవలం సుమారు వెయ్యిమంది రైతులు మాత్రమే బీమా చేయించడం గమనార్హం. ఏదేమైనా పంటల బీమాపథకం అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పకతప్పదు.