పంట నష్టం అంచనా వేయండి- జెడ్పిటిసి ధారాసింగ్ *
పెద్దేముల్ ఆగస్టు 8(జనం సాక్షి)
వర్షాకాలం రావడంతో ఖరీఫ్ పంటలు, పొలాల్లో రైతులు విత్తనాలు విత్తుకోవడం జరిగిన తర్వాత అవి మొలకెత్తిన వెంటనే తుఫాన్ల వల్ల వర్షాలు విపరీతంగా పడటంతో వాగులు చెరువులు నిండి పంట పొలాల్లో నీళ్లు నిలవడం, వాగుల వెంబడి ఉన్న గ్రామాల్లో వాగుల్లో నీళ్లు పోల్లలోకి ఎక్కి పంట మొక్కలు మొత్తం చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దేముల్ జెడ్పిటిసి ధారాసింగ్ నాయక్ జనంసాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ… ప్రభుత్వ వ్యవసాయ అధికారులు గ్రామాలలో తిరిగి ఖరీఫ్ పంటలలో చనిపోయిన పొలాలను గుర్తించి రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దేముల్ మండలంలోని 37 గ్రామ పంచాయతీలలో అధిక శాతం కంది, పత్తి, పెసర, మినుము, సోయాబీన్ వంటి పంటలు పూర్తిగా వర్ష భావం ఎక్కువగా ఉండటంతో చనిపోయాయని అన్నారు. గత నెల రోజుల నుండి అధిక వర్షాలు కురుస్తున్న ప్రభుత్వ వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి పంటలు పంట పొలాలు ఎలా ఉన్నాయో చూసిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. వేల రూపాయలు అప్పులు చేసి రైతన్నలు విత్తనాలు ఎరువులు తీసుకొచ్చి పంట పొలాల్లో వేసుకుంటే అధిక వర్షాలతో పంటలు నాశనం అవడం రైతన్నలకు అపులే శరణమని మిగిల్చాయి. వ్యవసాయము పండుగ అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం వ్యవసాయం పండుగలా లేకుండా దండుగలా ఉందన్నారు. గత మూడు సంవత్సరాల నుండి అధిక వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటివరకు ఒక్కసారైనా నష్టపరిహారం ఇవ్వలేదని తెలిపారు. వాగుల వెంబడి ఉన్న గ్రామాలు నాగులపల్లి, గోపాల్ పూర్, గాజీపూర్ ,ఖానాపూర్, కందనెల్లి, మన్ సాన్ పల్లి తదితర గ్రామాల్లో పంటలు వర్షానికి చనిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వ్యవసాయ అధికారులు గ్రామాలలో తిరిగి పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి రైతులకు పంట నష్టం అందేలా చూడాలన్నారు.