శృతిమించిన రాగం…. కవితపై వేటుకు రంగం సిద్ధం!
బహిష్కరించకపోతే పార్టీకి మరింత నష్టమని అధిష్టానం నిర్ణయం
బీజేపీలోకి బీఆర్‌ఎస్ విలీనం వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్
ఉపేక్షిస్తే పార్టీ మనుగడకే ప్రమాదమనే అభిప్రాయాలు
ఇప్పటికే లక్షలాది కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన ఎమ్మెల్సీ
ప్రతి జిల్లాలో ఆమెకు దూరంగానే ఉంటున్న కీలక నేతలు
రెండున్నర దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం.. లక్షలాది మంది కార్యకర్తలు గల బలమైన సైన్యం.. రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని పాలించిన పటుత్వ నాయకత్వం.. కానీ తాజా పరిణామాలు ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇంటి దొంగను ఈశ్వరుడెరుగడు’ అన్న చందంగా ఇంట్లో నుంచే పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసిన ఓ ప్రచారాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. చెట్టు మొదలు నరికివేసేందుకు సిద్ధమైన ఓ నేత.. లక్షలాది మంది కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం పార్టీకి చేటు చేస్తుందనే వాదన శరవేగంగా వ్యాప్తిస్తోంది. అనుబంధాలు వేరు.. రాజకీయాలు వేరని సొంతింట్లోనే వైరం ముదిరిందనే సంకేతాలివ్వకనే ఇచ్చేయడం మరింత సంక్షోభానికి కారణంగా మారింది. ఈ మొత్తం వ్యవహారం స్థానిక ఎన్నికలకు ముందు పార్టీకి నష్టం చేకూరుస్తుందనే విశ్లేషణలు వెలువడుతుండగా.. సుదీర్ఘకాల మనుగడను సుస్థిరంగా ఉంచుకోవాలంటే ‘గీత దాటిన సదరు నేత’పై వేటు తప్పదని తెలుస్తోంది.
స్పెషల్ కరస్పాండెంట్ (జనంసాక్షి) :
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైఖరి గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ బహిర్గతం కావడం హాట్ టాపిక్‌గా నిలిచింది. పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆమె వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభం ముదిరిందా అనే విశ్లేషణలు వచ్చాయి. అధికార, ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవహారంపై పలువిధాలుగా స్పందించి బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేశాయి. అయితే ఎమ్మెల్సీ కవిత ప్రవర్తన వల్ల తన సోదరుడు కేటీఆర్‌తో విభేదాలున్నట్టు తెలుస్తోంది. కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే తామంతా పనిచేస్తామని, బీఆర్‌ఎస్‌లో ఇతరుల నాయకత్వాన్ని సమర్థించబోమని కవిత ప్రకటించడం గమనార్హం. రాబోయే రాఖీ పండుగ నేపథ్యంలో ‘మా అన్నతో అనుబంధం వేరు.. రాజకీయాలు వేరు’ అంటూ కవిత తాజాగా చెప్పడం కూడా కేటీఆర్‌తో తనకు దూరం పెరిగిందనే అంశాన్ని తెలియజేస్తోంది. పదేపదే బీఆర్‌ఎస్‌లో ఉన్న కీలక నేతలనుద్దేశించి ఆమె విమర్శలు గుప్పించడం, ఏకపక్షంగా ముందుకెళ్లడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం పట్ల కేసీఆర్, కేటీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె వ్యాఖ్యలను సహించేది లేదనే స్పష్టతకొచ్చినట్టు సమాచారం.
కవితతో అందరూ దూరం.. దూరం
ఢల్లీి లిక్కర్ స్కాంలో అరెస్టు, అనంతరం జైలు నుంచి వచ్చిన తర్వాత కవితకు పార్టీలో సరైన మద్దతు లభించలేదు. ఈ విషయం కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖలోనూ వెల్లడైంది. కారణాలేమైనప్పటికీ.. పార్టీ నేతలపై విమర్శలు చేస్తూనే జిల్లాలవారీగా సొంతంగానే పలు కార్యక్రమాలు చేపడుతున్న కవితకు స్థానిక నేతల నుంచి ఎలాంటి మద్దతూ లభించడం లేదు. ఇటీవల ఆమెపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల సందర్భంగానూ బీఆర్‌ఎస్ నేతలుగానీ, ఎమ్మెల్యేలుగానీ ఎవరూ ఆమె పట్ల సానుభూతి తెలపలేదు. కీలక నేతలు కూడా ఆమెకు దూరంగానే ఉంటున్నారు. కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా కవిత వ్యాఖ్యల పట్ల బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల వల్ల తన ఉనికిని కోల్పోతున్నానని భావించారో ఏమోగానీ 25 ఏండ్ల ఉద్యమ ప్రస్థానమున్న పార్టీ మొదలును నరికేందుకు సిద్ధమయ్యారామె..! బీజేపీలోని బీఆర్‌ఎస్‌ను విలీనం చేయకుండా కాపాడటమే తన కర్తవ్యంగా ప్రకటించుకోవడంతో యావత్ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. దీంతో లక్షలాది మంది కార్యకర్తలు కూడా గందరగోళానికి గురయ్యారు. ఇది రాబోయే రోజుల్లో రాజకీయంగా పార్టీకి నష్టం చేయనుందనే భావనతో పాటు.. సరిగ్గా స్థానిక ఎన్నికల ముందు ఆమె వ్యాఖ్యలూ, వ్యవహారం పార్టీని పలుచన చేస్తుందనే ఆందోళన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు జాగృతి సంస్థ పేరిట 42శాతం రిజర్వేషన్ ఉత్సవం చేయడం, సొంత బలం పెంచుకునేందుకు పలు కార్యక్రమాలు ప్రకటించడం వల్ల పార్టీలో చీలిక రానుందనే వాదనలు వస్తున్నాయి. ఉద్యమ కాలం నుంచి జాగృతి పనిచేస్తుందని ఆమె చెప్తునప్పటికీ ఆనాటి ఉద్యమం వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు.
వేటేస్తేనే పార్టీకి మనుగడ..!
బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే కవిత వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. తరచూ పార్టీపై, నేతలపై విమర్శలు చేయడం వల్ల మున్ముందు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నట్టు కొందరు నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వ్యవహారం కూడా అందుకనుగుణంగా ఉండటంతో కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆమె వైఖరి ఇలాగే ఉంటే చీలికలు ఏర్పడతాయని కొందరు భావిస్తున్నారు. తనపై కొంతమంది వ్యాఖ్యల వెనుక బీఆర్‌ఎస్ పెద్ద నేత హస్తం ఉన్నట్టు కవిత ఆరోపిస్తుండటాన్ని సైతం అధిష్టానం తీవ్రంగానే తీసుకున్నట్టు తెలిసింది. ఈ పరిణామాలన్నింటిని దృష్ట్యా ఆమె విషయంలో చర్యలు చేపట్టకపోతే పార్టీ మనుగడకే ప్రమాదమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ ఓ సమావేశంలో పరోక్షంగా హెచ్చరించగా.. జగదీశ్‌లాంటి నేతలు కూడా ఆమెను తప్పుబట్టారు. కాబట్టి పార్టీ భవిష్యత్ దృష్ట్యా ఎమ్మెల్సీ కవిత మీద వేటు వేసేందుకు బీఆర్‌ఎస్ అధిష్టానం నుంచి రంగం సిద్ధమైనట్టు సమాచారం.