బనకచర్లపై వెనక్కుతగ్గేదేలేదు
` రద్దు చేసేవరకు పోరు ఆగదు
` గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకుంటాం
` 968 టీఎంసీల నీటి వాటా వాడుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం
– తుమ్మిడిహట్టి, , ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం..
– పత్తిపాక రిజర్వాయర్ డిపిఆర్ తయారీకి రూ.కోటి 10 లక్షల మంజూరు
– 3 బ్యారేజీలు లేకుండా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేశాం
– రామగుండంలో ప్రత్యేక పారిశ్రామిక వార్డు ఏర్పాటుకు కృషి..
– రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
` పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు
గోదావరిఖని(జనంసాక్షి): గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటా సంపూర్ణంగా వినియోగించు కునెలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్గాం మండలంలోని గోలివాడ వద్ద రామగుండం ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్ బాబులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహా హర కర వేణుగోపాల్ ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, విజయ రమణారావులు పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యుల కృషి మేరకు రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకు కోటీ పది లక్షల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు చేసి అంతర్గాం, ముర్మురు, బ్రాహ్మణ పల్లి ,ఎల్లంపల్లి సోమనపల్లి, మద్దిరాల , తొట్యాల పురం మొదలగు గ్రామాలకు, 17 ఎల్ ద్వారా కుక్కల గూడూరు, నిట్టూరు గ్రామాలకు మొత్తం 13 వేల పైగా ఎకరాలకు నీరు చేరుతుందని అన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడంలో రవాణాశాఖ మంత్రి పూర్ణం ప్రభాకర్ కృషి ఎంతగానో ఉందని అన్నారు. స్వతంత్ర భారత దేశంలో మొదటిసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత సాధించడంలో మన ప్రభాకర్ కృషి చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి సైతం శ్రీధర్ బాబు సలహాలు సూచనలు తీసుకుంటారని చెప్పారు. తెలంగాణ నీటి హక్కులను హరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని చూస్తుందని, గోదావరి పేపర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి సి.డబ్ల్యూ.సి వరకు ఫిర్యాదు చేసి ఆ ప్రాజెక్టును అడ్డుకున్నామని మంత్రి తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం, నీటి హక్కులకు వ్యతిరేకంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ చూస్తుందని, దీనిని అన్ని వేదికలలో, న్యాయ పరంగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మంథని నియోజకవర్గం, పెద్దపల్లి జిల్లాకు ఒక ఎకరాకు నీరు ఆందించలేదని అన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ ఘోష్ అందించిన నివేదికను క్యాబినెట్ ముందు పెడ్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గత ప్రభుత్వం లక్ష కోట్లు వృథా చేసిందని అన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టు 38 వేల కోట్లతో నిర్మించి ఉంటే నేడు గోదావరి పరివాహక ప్రాంతంలో కరువు ఉండేది కాదని అన్నారు. గత ప్రభుత్వం దోపిడి చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని తెలిపారు. 3 బ్యారేజీలు ఫౌండేషన్ బలహినంగా ఉందని, అక్కడ నీరు నిల్వ చేస్తే 44 ఊర్లు , భద్రాచలం కొట్టుకొని పోతాయని ఎన్.డి.ఎస్.ఏ రిపోర్ట్ అందించిందని అన్నారు. 3 బ్యారేజీల మరమ్మత్తు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వ్యవసాయ శాఖ, నీటీ పారుదల ప్రాజెక్టు సమన్వయంతో 3 బ్యారేజీలు నిరూపయోగంగా ఉండగా గత సంవత్సరం రికార్డు స్థాయిలో 2 కోట్ల 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని అన్నారు. గోదావరి నది పై తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన 968 టిఎంసీల నీరు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని అన్నారు.గోదావరి నది పరివాహక ప్రాంతంలో మంథని రామగుండం, పెద్దపల్లి ఉన్నాయని, ఇక్కడ సాగు నీరు ఆందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజి నిర్మాణం పునః ప్రారంభం చేసి పూర్తి చేస్తామని అన్నారు. ఇచ్చంపల్లి వద్ద కూడా మరో ప్రాజెక్టు నిర్మిస్తామని అన్నారు. గత ప్రభుత్వం 10 వేల కోట్ల ఖర్చు పెట్టి రేషన్ ద్వారా 2.82 కోట్ల దోడ్డు బియ్యం సరఫరా చేసేదని, ఆ బియ్యం 80 శాతం అక్రమాలకు, రీసైక్లింగ్ కు ఉపయోగపడేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా 3 కోట్ల 17 లక్షల మంది నిరుపేదలకు 13 వేల కోట్ల ఖర్చు చేసి నెలకు 6 కిలోల సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అర్హులైన అందరికీ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. 8 లక్షల 60 వేల నూతన రేషన్ కార్డుల జారీ చేశామని , రామగుండం ప్రాంతంలో అదనంగా 6500 నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడా కూడా 85% జనాభా కు సన్న బియ్యం రేషన్ ద్వారా సరఫరా చేస్తున్నామని అన్నారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రజలకు నాయకులు ఇచ్చిన హామీల అమలు మేరకు ఉమ్మడి జిల్లా మంత్రి వర్యులుగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. రేషన్ కార్డులు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు , ఇందిరమ్మ ఇండ్లు, అర్హులందరికీ పంపిణీ చేస్తామని అన్నారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో లక్షాధికారుల చేయాలని లక్ష్యంతో పని చేశామని, నేడు మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. బండ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో అనేక ధర్నాలు చేశామని అన్నారు. ప్రస్తుతం గత ప్రభుత్వాల తప్పిదాలను సరి చేస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేస్తే మన ప్రాంతంలో ఒక ఎకరా కు సాగు నీరు ఇవ్వలేదని విమర్శించారు. టెయిల్ ఎండ్ ప్రాంతాలకు సాగు నీరు స్థిరికరణ కోసం పత్తిపాక రిజర్వాయర్ ఎన్ని కోట్ల ఖర్చు చేసినా నిర్మిస్తామని, కోటిన్నర రూపాయల నిధులు మంజూరు చేసే సర్వే కు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం వల్ల 2 లక్షల 40 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ,10 వేల ఎకరాల నూతన ఆయకట్టు సృష్టించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం రైతులు అధిక ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో ఆయిల్ పామ్ విస్తరణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. రైతు ఆదాయ వనరులు పెంచే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని రావాలని అన్నారు. రామగుండం ప్రాంతంలో ఎన్టిపిసి, సింగరేణి, ఆర్.ఎఫ్.సి.ఎల్ , కేశారాం సిమెంట్ వంటి పరిశ్రమలు ఉన్నాయని , ఇక్కడ ప్రైవేట్ పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక పారిశ్రామిక వార్డు ఏర్పాటు చేస్తామని అన్నారు.ప్రస్తుతం స్థానికంగా అందుబాటులో ఉన్న సింగరేణి ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మిస్తామని అన్నారు. లారీ యాజమాన్యులకు ఉన్న సమస్యల పరిష్కారానికి రిపోర్ట్ అందించాలని మంత్రి కలెక్టరుకు సూచించారు. రామగుండం ప్రాంతంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, ప్రతి నీటి చుక్కను ఉత్తర తెలంగాణ ప్రాంతాలు వాడుకునేలా ప్రణాళికలు చేయాలని అన్నారు. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే కోరిక మేరకు స్థానిక బస్ స్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు.పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ,లి గత ప్రభుత్వం 17ఎల్, 27 ఎల్ ఆయకట్టు రైతులకు సాగు నీరు అందించే ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేశామని, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 20 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యం అవుతుందని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ,లి ప్రజల చిరకాల వాంచ రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రామగుండం ప్రాంతంలో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మించాలని కోరారు. స్థానికంగా ధాన్యం నిల్వ చేసేందుకు అదనపు గోడౌన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పారిశ్రామిక వార్డు ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.డి. సివిల్ సప్లై చౌహాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ్య గౌడ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.
బనకచర్లపై ఎంతవరకైనా పోరాడతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ధర్మారం: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాల మేరకే బనకచర్ల అనుమతులను సీడబ్ల్యూసీ, గోదావరి నదీ యజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించాయన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ అభ్యంతరాలతో కేంద్రం పర్యావరణ అనుమతులు నిలిపివేసిందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఇటీవల దిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్లపై తమ వాదనలు గట్టిగా వినిపించామని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టం, 1980-గోదావరి నదీజలాల పంపిణీ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఇవన్నీ తెలిసిన భారత రాష్ట్ర సమితి నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు.రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉండగా.. తమ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 98.59లక్షలకు చేరిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 8.64లక్షల కొత్త కార్డులు జారీ చేసిందని తెలిపారు. గతంలో 2.81కోట్ల మందికి నాసిరకమైన దొడ్డు బియ్యం పంపిణీ చేశారని.. ఇప్పుడు 3.17కోట్ల మందికి నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యం ఎవరూ తినడం లేదనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు.