పండుగలా చెక్కుల పంపిణీ- రైతుల సంక్షేమానికి కేసీఆర్ ప్రత్యేక కృషి
– తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
– రైతు బంధు పథకం అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి
– ఆధార్, వ్యక్తి లేకపోతే చెక్కులు ఇవ్వం – గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్గొండ, జనం సాక్షి
) : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని మంత్రి జగదీష్‌రెడ్డి సూచించారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో రైతు బంధు పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సమన్వయ సమితి సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగగా చేశారన్నారు. రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు రూ.6వేల కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని కోరారు. 2,632 క్లస్టర్లలో భూ రికార్డుల సర్వే పూర్తి చేశామని, ఒక్క దరఖాస్తుతో రైతుల సమస్యలను
పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపేలా కేసీఆర్ పట్టుదలతో, ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే రైతు సమితులు ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా గోదాంల నిర్మాణం, వేగవంతంగా ప్రాజెక్టుల పూర్తిపై దృష్టిసారించారన్నారు. ముఖ్యంగా రైతులు పంటల సాగు సమయంలో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఖరీఫ్, రబీల్లో ఎకరానికి రూ. 4వేల చొప్పున అందించి రైతులను ఆదుకొనేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా మే10 నుంచి వారం రోజుల పాటు గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు చెక్కులు అందివ్వటం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతు నాయకుడిగా పేరొందిని కేసీఆర్ ప్రతి ఒక్కరం అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఆధార్, వ్యక్తి లేకపోతే చెక్కులు ఇవ్వం – గుత్తా
ఆధార్ లేకపోయినా, వ్యక్తి లేకపోయినా చెక్కులు ఇవ్వమని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. భూ స్వాములు, అధికారులు పెట్టుబడి వద్దని తిరిగి ఇస్తే ఆ డబ్బును రైతు సంక్షేమం కోసం ఖర్చు పెడతామని సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు బంధు పథకం అన్నదాతలకు వరమని విప్ గొంగిడి సునీత అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు.