పండుగ పూట పస్తులు లేనా….?

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

** వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయకంటి శ్రీనివాస్

మానకొండూరు, ఆర్.సి, సెప్టెంబరు 20( జనం సాక్షి)

 

మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయకంటి శ్రీనివాస్ ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు.
కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాలుగు వారాలుగా ఉపాధి హామీ లో హరితహారం లో చెట్ల సంరక్షణ చేసిన డబ్బులు ఇప్పటికి రాలేదని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
కూలీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకు 600 రూపాయలు చెల్లించాలని ,ఉపాధి హామీ పనులు సంవత్సరానికి 214 పని దినాలు కల్పించాలని, ఉపాధి కూలీలకు నష్టం కలిగించే జీవో నెంబర్ 333 రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.
ఉపాధి కూలీలకు కోరిన వెంటనే పనులు కల్పించాలని ,వారం రోజుల్లో కూలి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆడబిడ్డలకు అత్యంత ప్రీతిపాత్రమైన, బతుకమ్మ పండుగ వస్తుందని పండగ పూట కూలీలు పస్తులు ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే కూలీలకు డబ్బులు చెల్లించకపోతే కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.