పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు
మెదక్, జనవరి 28 (): పట్టభద్రులు, ఉపాధ్యాయులు నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే మంజూరీ, పంపిణీ చేయకూడదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరము నుండి డివిజనల్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికలు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే మంజూరీ, పంపిణీ చేయకూడదని ఆయన అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎవరైనా అతిక్రమించినట్లైతే ఎన్నికల చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
రెవెన్యూ డివిజనల్ అధికారులు పర్యటించే ప్రాంతాలలో ఒక వీడియో గ్రాఫర్‌ను తమ వెంట తీసుకెళ్లి ఎన్నికల నియమావళిని అతిక్రమించిన చోట వీడియో చిత్రీకరణ చేయించాలని ఆయన తెలిపారు. సహాకార ఎన్నికలు మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్‌డ్రా పూర్తయ్యాయని వీటిని ఈ నెల 31 ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణలో నిర్వహించాలన్నారు. ఫిబ్రవరి 4, 2013న రెండవ విడత జరిగే సహకార ఎ న్నికలకు ఈ నెల 28నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, వీటిని పరిశీలన తదితర అంశాలపై నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. సహకార ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్భందీగా నిర్వహించాలన్నారు.
2012-13 సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌మెట్రిక్ ఉపకావేతనాలు నూతన/రెన్యూవల్ ఎస్సీ, ఎస్టీ, బిసి., వికలాంగులు, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన ఉపకావేతనాల వెరిఫికేషన్ అధికారులు ఈ నెల 29నాటికి పూర్తి చేసి, 31నాటికి అప్‌లోడ్ చేయాలని దరఖాస్తులు, బుక్‌లెట్ హార్డ్ కాపీ సంబంధిత సంక్షేమ అధికారులకు ఫిబ్రవరి 1, 2013లోగా సమర్పించాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఉపకారవేతనాల వెరిఫికేషన్‌లో ఎలాంటి జాప్యం జరిగినా సంబంధిత వెరిఫికేషన్ అధికారులు, ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఆధార్‌కార్డుల నమోదుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను మండల తహశీల్దార్లు పర్యవేక్షించాలని, ఎక్కడైనా కిట్స్ అవసరమున్నట్లైతే సంబంధిత ఏజెన్సీకి తెలియజేసి ఏర్పాటు చేయించాలన్నారు. ఆధార్ కేంద్రాలలో బయోమెట్రిక్ తీసుకొనేటప్పుడు పింఛన్ పొందే వారికి విద్యార్థినీ, విద్యార్థులకు ప్రాముఖ్యతనివ్వాలన్నారు. 10వ తరగతి ఉన్న పాఠశాలలను దత్తత అధికారులు ప్రతి వారం విధిగా ఆ పాఠశాలను సందర్శించి విద్యార్థుల యొక్క ప్రగతి నివేదిక జిల్లా విద్యాధికారికి సమర్పించాలన్నారు. పైకా క్రీడలు నిర్వహించేందుకు మండల పరిషత్తు అభివృద్ధి అధికారులకు కేటాయించిన నిధులు ఖర్చుచేసినట్లైతే ఈ 31లోగా యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలని, నిధులు ఖర్చుచేయకుండా నిల్వ ఉంటే అట్టి నిధులను తిరిగి పంపించాలని ఆయన అధికారులకు సూచించారు.
జిల్లాలో ఇంకా ఇన్‌ఫుట్ సబ్సిడి అందని 5శాతం అర్హత కలిగిన రైతులకు ఎ ందుకు అందలేదో విచారణ జరిపి ఈ నెల 31లోగా నివేదిక సమర్పించాలన్నారు. బోధకాలు నివారణకు సోమవారం నుండి మూడురోజులపాటు ఇంటింటికి తిరిగి బోదకాలు నివారణ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని, బోదకాల నివారణ మాత్రలు సక్రమంగా పంపిణీ జరిగే విధంగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సెట్‌కాన్షరెన్స్‌లో అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎస్.వి.వి.ఎస్.మూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఐ.ప్రకాష్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.