పకడ్బందీగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు
ప్రశాంతతకు మారుపేరు సూర్యాపేట
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ప్రశాంతత కు మారు పేరు సూర్యాపేట పట్టణమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆనందోత్సవాల మధ్య ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం వేడుకలను పూర్తిచేసుకుని సూర్యాపేట వాసులకు తమకు ఉన్న పేరు ను నిలబెట్టుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.నేడు సూర్యాపేటలో జరగనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను సద్దుల చెరువు ట్యాంక్ బండ్ వద్ద మంత్రి పరిశీలించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైందని, నేడు జరిగే ప్రధాన నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయడం ద్వారా ఐక్యమత్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సూర్యాపేట ఖ్యాతిని మరోసారి పెంపొందించేందుకు ప్రతిఒక్కరం సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ ప్రత్యేకతను కాపాడటానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని పేర్కొన్నారు. ప్రధానంగా నిమజ్జన కార్యక్రమం సందర్భంగా శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా మున్సిపల్ , విద్యుత్, పోలీస్ , రోడ్లు, భవనాలు, రెవిన్యూ శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, శోభయాత్ర జరిగే రహదారులలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్టు వివరించారు.ప్రత్యేక శానిటేషన్ బృందాలను ఏర్పాటు చేసి నిమజ్జన శోభయాత్ర మార్గంలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం చేపడుతామని తెలిపారు.ట్యాంక్‌బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు.దారి మళ్లింపు , నిమజ్జన ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, ప్రజలు పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలపై ముందే ప్రజలకు పూర్తి స్థయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.వినాయక నిమజ్జనాలు అత్యంత ప్రశాంతంగా జరిగేట్లు చూడాలన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.వినాయక మండపాల బాధ్యులకు ముందుగానే తగు సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ , జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్, అయూబ్ ఖాన్, ఎల్గూరి రాంబాబు , దేశాగాని శ్రీనివాస్ గౌడ్ , కీసర వేణుగోపాల్ రెడ్డి , అనీల్ రెడ్డి మదిరెడ్డి, రమాకిరణ్, రఫీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.