పక్కాగా రైతు బంధు పథకం అమలు: ఎమ్మెల్యే

మెదక్‌,మే5(జ‌నం సాక్షి ): దేశంలోనే మొదటిసారిగా రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి 17 వరకు అన్ని గ్రామాల్లో రైతు బంధు చెక్కులను, పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ప్రభుత్వం రూ.4వేల పెట్టుబడిని అందజేస్తుందని తెలిపారు.  ఈ పథకంతో రైతులకు కష్టాలు తీరడం ఖాయమని, అలాగే వ్యవసాయంలో భరోసా వస్తుందని అన్నారు.  నియోజకవర్గ స్థాయి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రైతు బంధు పథకంపై ప్రజాప్రతినిధులకు, రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన సదస్సులతో పథకం పక్కాగా అమలు చేసేందుకు సాగుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రైతు కావడంతోనే వ్యవసాయాన్ని లాభసాటి చేసి బంగారు తెలంగాణను సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఏళ్ల తరబడి నెలకొన్న భూ సమస్యలకు భూసర్వే  ద్వారా శాశ్వత పరిష్కార మార్గాలు చూపారని తెలిపారు. అర్హులుగా ఉన్న రైతులందరికి నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ముద్రించి పంపిణీకి సిద్ధంగా ఉంచారన్నారు.రైతు సమన్వయ సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి రైతులకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను బాధ్యతగా పంపిణీ చేయించి విజయవంతం చేయాలని సూచించారు. రైతు బంధు చెక్కులు నేరుగా రైతులకే అందజేస్తారని, అందుబాటులో లేనివారికి వారు వచ్చేంత వరకు అధికారుల దగ్గరనే ఉంచుకుని తర్వాత పంపిణీ చేస్తాని తెలిపారు.